
బెంగాల్‌లో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కోల్‌కతా శివార్ల లోని మహేస్థలాలో బుధవారం అల్లర్లు చెలరేగడంతో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. శివాలయాన్ని ధ్వంసం చేయడంతో గొడవలు చెలరేగినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని , అందుకు ఈ ఘటన నిదర్శనమని బీజేపీ శాసనసభా పక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. బెంగాల్ అసెంబ్లీ బయట ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. మహేస్థలా వెళ్లడానికి వాళ్లు ప్రయత్నించారు. అయితే పోలీసుల వాళ్లను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. తరువాత బీజేపీ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి ఈ ఘటనపై గవర్నర్ ఆనందబోస్‌కు ఫిర్యాదు చేశారు.
అయితే ఓ షాప్‌కు సంబంధించి రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయని పోలీసులు తెలిపారు. అల్లరిమూకల దాడిలో పోలీసులకు గాయాలయ్యాయి. దుకాణాలకు , ఇళ్లకు నిప్పు పెట్టారు. వాహనాలను తగలబెట్టారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అల్లర్ల కేసులో 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గొడవలో పోలీసుల వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.
అయితే రాష్ట్రంలో మరోసారి హింసను రెచ్చగొట్టడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. స్థానకుల మధ్య గొడవకు మతం రంగు పులిపే ప్రయత్నం చేస్తున్నారని టీఎంసీ నేతలు ఆరోపించారు.