Maharashtra cancels exams: దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఏడాది క్రితం మొదలైన మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. మరోసారి సెకండ్ వేవ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మలి విడతలోనూ మహారాష్ట్రపై పంజా విసురుతోంది. దీంతో కరోనా కట్టడిలో భాగంగా ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కరోనా కట్టడికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ వెల్లడించారు. రాష్ట్రంలో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థులందరినీ ఎటువంటి పరీక్షలు లేకుండా పై తరగతులకు వెళ్లేలా పాస్ చేస్తున్నామని ప్రకటించారు.
ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియో సందేశాన్ని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి పోస్ట్ చేశారు. ఇక, 9 నుంచి 11 తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయడానికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే త్వరలో నిర్వహించనున్న బోర్డ్ ఎగ్జామ్స్‌పై వర్ష గైక్వాడ్ ఏ విధమైన స్పష్టత ఇవ్వలేదు.
? Announcement: In view of the ongoing situation due to #Covid 19, all state board students across Maharashtra state from Class 1st to Class 8th will be promoted to the next class without any examinations. A decision regarding students of class 9th and 11th will soon be taken. pic.twitter.com/3eA5hvQUG5
— Varsha Gaikwad (@VarshaEGaikwad) April 3, 2021
ఇక, మహారాష్ట్రలో ఎస్ఎస్‌సీ, హెచ్‌ఎస్‌సీ బోర్డ్ ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, విద్యార్థులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా పరీక్షలను సేఫ్‌గా నిర్వహించేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకోసం విద్యా శాఖ మంత్రి వర్ష గైక్వాడ్ పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి చర్చించి.. పరీక్షలను అత్యుత్తమంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ఆ కమిటీలను కోరారు. . అయితే, పరీక్షలను సురక్షితంగా, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ గతంలో చెప్పింది. ప్రస్తుత తరుణంలో పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, మహారాష్ట్రలో కరోనా వికృత రూపం కొనసాగుతుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కఠి నియంత్రణ చర్యలు, ఆంక్షలు విధించింది మహరాష్ట్ర సర్కార్. ఇదే క్రమంలోనే కరోనా పరిస్థితి అదుపులోకి రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం సాగింది.
ఇదిలావుంటే, శుక్రవారం రోజున వాటిపై స్పందించిన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ఆయన స్పష్టం చేశారు. అయితే పూర్తి లాక్‌డౌన్‌కు బదులుగా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టామని.. రెండు మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని అన్నారు. ఇక, మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే దాదాపు 47వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.