Madras High Court Judgement: ఓ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. తాళం వేసిన గదిలో అవివాహితులైన ఆడ, మగ ఉంటే ఎలాంటి నేరం కాదని తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. చెన్నైలో 1998లో సాయుధ దళంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శరవణబాబు ఇంటిలో అదే ప్రాంతానికి చెందిన మహిళా కానిస్టేబుల్ ఉన్నప్పుడు స్థానికులు ఆ ఇద్దరు ఏదో తప్పిదాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో ఆ గదికి తాళం వేశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఆ ఇంటి కెళ్లి తాళం తీశారు. లోపలికి వెళ్లి పరిశీలించగా, శరవణబాబు, మహిళా కానిస్టేబుల్ ఉన్నారు.
ఈ సంఘటనపై విచారణ జరిపిన అనంతరం శరవణబాబుకు మహిళా కానిస్టేబుల్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు పరిగణించి ఆయనను సస్పెండ్ చేశారు. ఈ ఉత్తర్వును సవాల్ చేస్తూ శరవణబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై 23 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. హైకోర్టు న్యాయమూర్తి సురేష్ కుమార్ ఇరు పక్షాల వాదప్రతివాదనల తర్వాత శుక్రవారం తీర్పు వెలువరించింది. మహిళా కానిస్టేబుల్ తప్పు చేయాలనే ఉద్దేశంతో కానిస్టేబుల్ శరవణబాబు ఇంటి లోపలకు వెళ్లినట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, అవివాహితులైన ఆడ, మగ ఓ గదిలో ఉంటే తప్పుగా భావించే అవకాశం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగే సస్పెండ్ చేసిన శరవణబాబును మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. తాళం వేసిన గదిలో ఓ ఆడ, మగ ఉంటే ఆ చోట వ్యభిచారం జరిగినట్లు భావించలేమని, సమాజంలో పలు అభిప్రాయాలు ఉన్నంతమాత్రన వాటి ఆధారంగా క్రమ శిక్షణారాహిత్య చర్యలు తీసుకోవడమో, లేక శిక్షించడమే భావ్యం కాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
Also Read: Thieves Gang: 300లపైగా కేసులున్న దొంగల ముఠా అరెస్టు.. వివరాలు వెల్లడించిన సీపీ అంజనీకుమార్