
గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలు భూమిపైనే కాదు, మహాసముద్రాలలో కూడా కనిపిస్తున్నాయి. పెరుగుతున్న సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, బలమైన అలలు పగడపు దిబ్బలు ధ్వంసమయ్యేందుకు కారణమవుతున్నాయి. 1998 నుండి భారతదేశంలోని లక్షద్వీప్‌లోని 50 శాతం పగడపు దిబ్బలు కనుమరుగయ్యాయని 24 సంవత్సరాల అధ్యయనంలో తేలింది. ప్రపంచ స్థాయిలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.. ఇది పగడపు దిబ్బల అదృశ్యం మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థ, సహజ సమతుల్యత, పర్యావరణ వ్యవస్థ మనుగడకు కూడా సంబంధించిన ఆందోళనకర అంశంగా చెబుతున్నారు.
లక్షద్వీప్ తీరంలో కనిపించే రంగురంగుల పగడపు దిబ్బల కారణంగా అది ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. అక్కడ అలాంటి దిబ్బలు చాలా ఉన్నాయి. వాటి ఉనికికే గ్లోబల్ వార్మింగ్ ముప్పు ఏర్పడింది. 1998- 2022 సంవత్సరా మధ్య లక్షద్వీప్‌లో పగడపు దిబ్బలు 37.24 శాతం నుండి 19.6 శాతానికి తగ్గాయని ‘డైవర్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్’ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం తెలిపింది.
పగడాలు అనేవి మృదువైన సముద్ర జీవులు. ఇవి దాదాపు ఒక అడుగు ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ జీవులు తమ నివాసం కోసం నీటిలో గూళ్ళు నిర్మించుకుంటాయి. క్రమంగా, అలాంటి అనేక గూళ్ళు కలిసి రంగురంగుల పగడపు దిబ్బలను ఏర్పరుస్తాయి. పగడపు దిబ్బలతో కూడిన ద్వీపాలు కూడా ఏర్పడ్డాయి. ఇవి ఏర్పడటానికి వేల సంవత్సరాలు పడుతుంది.
పగడాలు, ఆల్గే నీటిలో సహజీవనం చేస్తాయి. పగడాలు చాలా అందంగా చూసేందుకు ఎంతో ఆకర్షణీయమైన రంగులను కలిగి ఉండటానికి ఆల్గే ప్రధాన కారణం. పగడపు దిబ్బలు రంగురంగుల చేపలతో సహా 25 శాతం సముద్ర జీవులకు నిలయం. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా, పగడాలు ఆల్గేను వదిలివేస్తున్నాయి. దీని కారణంగా పగడాలు బలహీనంగా మారుతున్నాయి. వాటి రంగును కోల్పోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగుతుండగా పగడపు దిబ్బలు క్రమంగా నాశనం అవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ దిబ్బలు నాశనమైతే కేవలం పగడాలు మాత్రమే చనిపోవు. వాటిలో ఆశ్రయం పొందే అనేక రకాల సముద్ర జీవులు కూడా చనిపోతాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. పగడపు దిబ్బల నాశనాన్ని నివారించడం అనేది నిర్దిష్ట ప్రాంత ఆధారిత చర్యల ద్వారా మాత్రమే సాధించబడదని అంటున్నారు. ఇందుకోసం తగిన విధానాలను రూపొందించడం, పెద్ద ఎత్తున చర్యలను అమలు చేయడం తక్షణ అవసరం అంటున్నారు.
ఉష్ణోగ్రత మార్పు, సముద్ర జలాల్లో మానవ జోక్యం అధికంగా ఉండటం, ఎన్ నినో ప్రభావం కారణంగా పగడపు దిబ్బలు చనిపోతున్నాయి. గత 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా అనేక పగడపు దిబ్బలు కనుమరుగయ్యాయి. భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి మూడొంతుల దిబ్బలు కనుమరుగవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రకృతి సమతుల్యతలో పగడాలు, పగడపు దిబ్బలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సముద్రంలో బలమైన అలలు, తుఫానులు సంభవించినప్పుడు ఈ పగడపు దిబ్బలు అలల శక్తిని గ్రహించి వాటి తీవ్రతను తగ్గిస్తాయి. అవి తీరప్రాంత కోతను నివారిస్తాయి. అవి పరోక్షంగా కోట్లాది మంది ప్రజల జీవితాలకు, జీవనోపాధికి సహాయపడతాయి. పర్యాటకం సహా వివిధ పరిశ్రమల ద్వారా వేల కోట్ల రూపాయల విలువైన టర్నోవర్‌ను సృష్టిస్తాయి. అవి అంతరించిపోవడం అనేది మానవాళికి హెచ్చరిక సందేశాన్ని పంపుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..