SIT on Lakhimpur Kheri Case: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతులపై జరిగిన హింసాకాండ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పర్యటనలో నిరసన చేస్తున్న రైతులపైకి ఆయన కొడుకు ఆశిశ్ మిశ్రా కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా.. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేంద్ర మంత్రి కొడుకు ఆశిశ్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే.. రైతులు, విపక్షాల నుంచి వచ్చిన ఒత్తిడితో కేంద్రం.. ఈ ఘటనపై సిట్ దర్యాప్తుకు ఆదేశించింది.
ఈ ఘటనపై దర్యాప్తు చేసిన సిట్.. మంగళవారం కీలక విషయాలను వెల్లడించింది. ఈ హింసాకాండ ప్రణాళికాబద్దమైన కుట్ర అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. అయితే.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రాపై ఇప్పటికే నమోదైన అభియోగాలను మార్చాలంటూ ఈ కేసు విచారణ జరుపుతున్న న్యాయమూర్తికి సిట్ లేఖ రాసింది. ఇప్పటికే ఈ కేసులో మంత్రి కుమారుడు ఆశిశ్ మిశ్రా, తదితరులపై హత్య, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ అభియోగాలతోపాటు హత్యయత్నం, ఇతర అభియోగాలను కూడా ఈ కేసులో చేర్చాలని సిట్ ఆ లేఖలో కోరింది.
కాగా.. లఖింపుర్‌లో సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అన్నదాతలపైకి అక్టోబర్ 3న ఆశిశ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లింది. ఆ ఘటనలో మొత్తం 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సైతం వైరల్ కావడంతో.. దేశవ్యాప్తంగా రైతులు, పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. కేంద్రమంత్రిగా ఉన్న అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు యూపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసును త్వరగా విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది.
Also Read: