
తన తోటి పామును చంపేశారనే కోపంతో ఓ పాము ఆ ఇంట్లో ఉన్న ఇద్దు చిన్నారులపై పగతీర్చుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న అన్నా చెల్లలను కాటేసింది. ఈ దాడిలో పాము కాటుకు గురై 6 ఏళ్ల బాలుడు మృతి చెందగా, 4 ఏళ్ల చెల్లి చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో పోరాడుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా బడాగావ్ పీఎస్ పరిధిలో వెలుగు చూసింది ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఝాన్సీ సమీపంలోని బడాగావ్‌కు చెందిన ప్రదీప్ కుష్వాహా భార్య నేహ (26), తన ఇద్దరు పిల్లలు మయాంక్ (6), ప్రగతి (4)లతో కలిసి స్థానికంగా నివసిస్తున్నారు. అయితే ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో 4 ఏళ్ల కూతురు ప్రగతి పాము కాటు వేయడంతో గట్టిగా ఏడవడం ప్రారంభించింది. అది గమనించిన తల్లి వెంటనే పాపు ఎత్తుకొని అత్తగారికి అప్పగించింది.
ఇంతలోనే ఆమె 6 ఏళ్ల కొడుకు మయాంక్ కూడా బిగ్గరగా కేకలు వేస్తూ ఏడవడం ప్రారంభించాడు. దీంతో కంగారు పడిన నేహ వెంటనే కొడుకు దగ్గరకు వెళ్లి చూడగా బాలుడి శరీరానికి ఒక కట్ల పాము చుట్టుకుని కనిపించిది. అది బాలుడిని సుమారు 3-4 చోట్ల తీవ్రంగా కాటేసింది. ఇక ఎలాగా బాలుడి నుంచి పామును విడిపించిన కుటుంబ సభ్యులు.. ఇద్దరు పిల్లలను స్థానిక మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
అయితే చికిత్స పొందుతూ ఉదయం 9:30 గంటలకు మయాంక్ కన్నుమూశాడు. దీంతో ఆదివారం సాయంత్రం 7 గంటలకు బాలుడి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుతం బాలిక మాత్రం హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతూ ఉంది. అయితే ఈ ప్రమాదానిక సంబంధించి బాధిత తల్లి చెప్పిన కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి.
రెండు రోజుల క్రితమే ఒక పామును చంపారు
ఈ ఘటనపై బాధిత తల్లి నేహ మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల క్రితమే ఇంట్లో ఒక జంట పాములు కనిపించాయని.. అప్పుడు ఇంట్లోని వారు వాటిలో ఒక పామును కొట్టి చంపేశారు మరో పాము తప్పించుకుందని తెలిపింది. ఆ తప్పించుకున్న పామే ఇప్పుడు కాలకూట విషమై వచ్చి తన పిల్లలను మింగేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. కుమార్తెను పక్కకు తీసుకెళ్లే సమయంలోనే కొడుకును కూడా తెచ్చుకుని ఉంటే బాగుండేది అని విలపించింది.
మరోవైపు ఆమె వాదనను వైద్యులు తప్పు పట్టారు మొదటి పామును చంపినందుకు రెండో పాము పగ తీర్చుకుందనేది అపోహ మాత్రమేనని కొట్టి పారేశారు. అక్కడ ముందే రెండు పాములు ఉండి ఉంటాయని, ఒకదాన్ని చంపినప్పుడు రెండోది తప్పించుకుని ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు.
వైద్యుల సూచనలు
విషపూరితమైన పాము కరిచినప్పుడు టైం వేస్ట్ చేయకుండా వెంటనే యాంటీ స్నేక్ వెనమ్ అందుబాటులో ఉన్న ఆస్పత్రికి తరలించాలని వైద్యులు చెబుతున్నారు. మూఢనమ్మకాలు నమ్మకాల పేర్లతో మంత్రగాళ్లు, నాటు వైద్యం అని ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. చాలా సందర్భాల్లో సమయానికి వైద్యం అందకపోవడమే పాము కాటు మరణాలకు కారణమవుతోందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.