తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కేంద్రం కమిటీ.. వెల్లడించిన కిషన్ రెడ్డి..

తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య నదీ జలాల వినియోగానికి సంబంధించిన వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని నోటిఫై చేసినట్లు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. కృష్ణా–గోదావరి జలాలపై ఇరు రాష్ట్రాల సమస్యలను సాంకేతికంగా పరిశీలించి పరిష్కారం చూపడమే కమిటీ లక్ష్యమని వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కేంద్రం కమిటీ.. వెల్లడించిన కిషన్ రెడ్డి..
Kishan Reddy

Updated on: Jan 02, 2026 | 5:36 PM

 

తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాల వినియోగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ అంశాలను సాంకేతికంగా పరిశీలించి పరిష్కార మార్గాలు సూచించేందుకు జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని నోటిఫై చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. సహకార ఫెడరలిజం స్ఫూర్తితో గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని తెలిపారు. ఈ క్రమంలో నీటి సమస్యలపై చర్చలు జరిపేందుకు కేంద్రం అవసరమైన వేదికను కూడా కల్పిస్తోందన్నారు.

కృష్ణా జల వివాదంపై కేంద్ర చర్యలు

కృష్ణా నది జలాల వివాద పరిష్కారానికి 2023 అక్టోబర్ 6న కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–2 (KWDT-II)కు అదనపు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినట్లు కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రెండేళ్ల గడువు 2025 ఆగస్టు 1తో ముగిసినప్పటికీ, కృష్ణా జలాల వినియోగంపై చర్చలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ట్రిబ్యునల్ గడువును మరో ఏడాది పెంచి 2026 జూలై 31 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ విధంగా జల వివాదాల పరిష్కారానికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు.

ఏపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లోని చాప్టర్–9, సెక్షన్–84 ప్రకారం కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించిన అంశాల పరిష్కారానికి ఏపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కౌన్సిల్‌లో కేంద్ర జల్ శక్తి మంత్రి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2025 జూలై 16న న్యూఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని జల వివాదాలపై చర్చించినట్లు తెలిపారు.

సాంకేతిక కమిటీ ఏర్పాటు

ఆ సమావేశంలో జల వివాదాలను సాంకేతిక కోణంలో అధ్యయనం చేయడానికి కేంద్రం, రెండు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం రెండు రాష్ట్రాలు తమ ప్రతినిధులను నామినేట్ చేయాలని సూచించగా, తెలంగాణ ప్రభుత్వం 2025 డిసెంబర్ 23న ప్రతినిధుల వివరాలను పంపిందన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జల్ శక్తి మంత్రిత్వ శాఖ కమిటీని అధికారికంగా నోటిఫై చేసినట్లు వెల్లడించారు.

ఈ కమిటీకి సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) చైర్మన్ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. తెలంగాణ నుంచి నీటివనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి, ఇంజినీర్-ఇన్-చీఫ్ సభ్యులుగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నీటివనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఇరిగేషన్ శాఖ సలహాదారు, ఇంజినీర్-ఇన్-చీఫ్, చీఫ్ ఇంజినీర్ ప్రాతినిథ్యం వహిస్తారు. కేంద్ర సంస్థల నుంచి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) చైర్మన్, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) చైర్మన్, నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (NWDA) చీఫ్ ఇంజినీర్, సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) చీఫ్ ఇంజినీర్ సభ్యులుగా వ్యవహరించనున్నారు.

Committee Members