’కరోనాకు విరుగుడు‘ అంటూ…చెత్త ప్రచారం ఆపండి: ఖుష్బూ

భారత్‌లోనూ కరోనా ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాకు సంబంధించిన ప్రతి వార్త వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ ను ఇలా కూడా నివారించవచ్చంటూ జరుగుతున్న కొన్ని ప్రచారాలపై సినీ నటి, తమిళనాడు కాంగ్రెస్ మహిళా నేత ఖుష్బూ ఘాటుగా స్పందించారు..

’కరోనాకు విరుగుడు‘ అంటూ...చెత్త ప్రచారం ఆపండి: ఖుష్బూ

Updated on: Mar 16, 2020 | 1:13 PM

ప్రపంచంలోని ప్రధానమైన దేశాల్లో కరోనా మహమ్మారి మోగిస్తున్న మరణమృదంగం చూస్తే…మిగిలిన దేశాలు భయంతో వణకిపోతున్నాయి. ఇలాంటి భయానక పరిస్థితుల నుంచి ఎప్పుడు బయటపడతామా ? అనే ఆందోళన కనిపిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ తగిన చర్యలను చేపడుతున్నాయి. భారత్‌లోనూ కరోనా ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాకు సంబంధించిన ప్రతి వార్త వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ ను ఇలా కూడా నివారించవచ్చంటూ జరుగుతున్న కొన్ని ప్రచారాలపై సినీ నటి, తమిళనాడు కాంగ్రెస్ మహిళా నేత ఖుష్బూ ఘాటుగా స్పందించారు. ట్విటర్ వేదికగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

గోమూత్రం, పేడతో కరోనా వైరస్‌‌ను నయం చేయవచ్చు అంటూ చేస్తున్న ప్రచారంపై స్పందిస్తూ ఖుష్బూ ట్వీట్ చేశారు. ‘మీరు ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలకు సంబంధించిన విషయాల్లో మతాలను, కాషాయ రంగును ప్రవేశపెట్టొద్దు. చదువుకోని పేదలను తప్పుదోవ పట్టించొద్దు. గుడ్డివాళ్లూ ఇకనైనా మేల్కొంటారా? గోమూత్రం అన్నీ రోగాలను నయం చేస్తుందన్న చెత్త ప్రచారాన్ని ఆపుతారా?’ అంటూ ఖుష్బూ విరుచుకుపడ్డారు. తన ట్వీట్‌లో ప్రొఫెసర్ స్టేవ్ హంకే ట్వీట్‌ను కూడా జతచేశారు. అందులో ఆయన గోమూత్రంతో, పేడతో కరోనా వైరస్ వ్యాపించదు అని దానిని సేవిస్తే మరిన్ని అనారోగ్యాలను కొనితెచ్చుకున్నవారు అవుతారని.. భారతీయులకు సైన్స్ పాఠాలు అవసరం అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, తాగా ఖుష్బూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కరోనాను నివారించే శక్తి కేవలం గోమూత్రం, పేడకు మాత్రమే ఉందంటూ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ అఖిల హిందూ మహాసభ అధ్వర్యంలో గోమూత్ర పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గోమూత్రం తాగితే కరోనా దరిచేరదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ‘గోమూత్ర పార్టీ’లను మరిన్ని నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచుతామని అన్నారు. స్వామి చక్రపాణి మహారాజ్.