కొడుకు కిడ్నాప్‌ అంటూ తండ్రికి కాల్..! రంగంలోకి దిగిన పోలీసులు.. చివరికి సీన్ రివర్స్

హాసన్‌లో డబ్బు కోసం తన కిడ్నాప్‌ను తానే ప్లాన్ చేసుకున్న కొడుకు డ్రామాను పోలీసులు ఛేదించారు. అప్పులు తీర్చేందుకు తండ్రి నుండి రూ.90 లక్షలు వసూలు చేయాలని పథకం వేసిన మనీష్‌, ఇద్దరు సహచరులతో సహా అరెస్ట్ అయ్యాడు. మొదట తండ్రికి ఫోన్ చేసి కిడ్నాప్ చేశామని నమ్మించినా, పోలీసులు మొబైల్ ట్రాకింగ్ ద్వారా నిందితులను పట్టుకున్నారు. ఇది కేవలం డబ్బు కోసమే అని తేలడంతో అందరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

కొడుకు కిడ్నాప్‌ అంటూ తండ్రికి కాల్..! రంగంలోకి దిగిన పోలీసులు.. చివరికి సీన్ రివర్స్
Fake Kidnap

Updated on: Oct 03, 2026 | 9:10 AM

కర్ణాటకలోని హాసన్‌ జిల్లాలో డబ్బు కోసం ఓ వ్యక్తి తన తండ్రినే మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తనను కిడ్నాప్‌ చేశారని నమ్మించి తండ్రి నుంచి రూ.90 లక్షలు వసూలు చేసేందుకు పథకం పన్నిన 40 ఏళ్ల మనీష్‌.. చివరకు ఇద్దరు సహచరులతో కలిసి పోలీసులకు చిక్కాడు. ముగ్గురినీ అరెస్ట్‌ చేసిన పోలీసులు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనీష్‌ తన తండ్రి మనోహర్‌ పటేల్‌ (62)కు డబ్బు లావాదేవీ కోసం రైలులో గడగ్‌ జిల్లాకు వెళ్తున్నానని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం ఫోన్‌ చేస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అయితే ఉదయం మనోహర్‌కు తన కుమారుడి నంబర్‌ నుంచి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. మనీష్‌ను కిడ్నాప్‌ చేశామని, అతడిని విడిపించేందుకు రూ.90 లక్షలు ఇవ్వాలని ఇద్దరు వ్యక్తులు డిమాండ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో ఆందోళనకు గురైన మనోహర్‌ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు మనీష్‌ మొబైల్‌ ఫోన్‌ను ట్రాక్‌ చేయడం ప్రారంభించగా.. మొదట ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో ఉంది. అనంతరం మరో నంబర్‌ నుంచి మనోహర్‌కు కాల్‌ వచ్చింది. అందులో సొమ్ము ఖరారైందా అని అవతలి వ్యక్తులు అడిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ నంబర్‌ను పోలీసులు ట్రేస్‌ చేయగా హాసన్‌ ప్రాంతంలోని ఓ లొకేషన్‌ గుర్తించారు. అక్కడికి వెళ్లి ఓ గదిలో తనిఖీలు చేయగా.. మనీష్‌ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి నిద్రిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో మనీష్‌ తన తండ్రి నుంచి డబ్బు తీసుకునేందుకు కిడ్నాప్‌ డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ఓ వ్యాపార లావాదేవీలో డబ్బు కోల్పోయి అప్పులు తీర్చాల్సి రావడంతో తండ్రి నుంచి నగదు తీసుకునేందుకు ఈ పథకం పన్నినట్లు డీసీపీ యతీష్‌ తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు మనీష్‌తో పాటు అతడి ఇద్దరు సహచరులను అరెస్ట్‌ చేసి పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలుకు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us