karnataka bank Robbery: మనీహేస్ట్ లెవల్‌ బ్యాంక్‌ రాబరీ.. కట్‌చేస్తే.. దోపిడి గ్యాంగ్‌కు దిమ్మతిరిగే షాక్‌!

కర్ణాటకలో తీవ్ర సంచలనంగా మారిన కెనరా బ్యాంక్‌ దోపిడి కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు దోపిడీలలో ఒకటైన రూ.53 కోట్ల విలువైన ఆభరణాలను దొంగిలించిన కేసులో ఓ బ్యాంక్‌ మేనేజర్‌ సహా మరో ముగ్గురిని కర్ణాటక పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసులో ప్రధాన నిందితుడు గతంలో ఇదే బ్యాంక్‌లో మేనేజర్‌గా విధులు నిర్వహించినట్టు తెలుస్తోంది.

karnataka bank Robbery: మనీహేస్ట్ లెవల్‌ బ్యాంక్‌ రాబరీ.. కట్‌చేస్తే.. దోపిడి గ్యాంగ్‌కు దిమ్మతిరిగే షాక్‌!
Karnataka

Updated on: Jun 30, 2025 | 10:31 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక కెనరా బ్యాంక్‌ దోపిడి కేసును వియవంతంగా చేధించినట్టు కర్ణాటక పోలీసులు శుక్రవారం వెల్లడించారు. రూ.53 కోట్ల విలువైన ఆభరణాలను దొంగిలించిన కేసులో మాజీ బ్యాంక్‌ మేనేజర్‌ సహా మరో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. పట్టుబడిన నిందితులను విజయకుమార్ మిరియాల (41), అతని సహచరులు చంద్రశేఖర్ నేరెల్ల (38), సునీల్ నరసింహలు (40) గా పోలీసలు గుర్తించారు. వీరు ముగ్గురు మే 25న విజయపుర జిల్లాలోని మనగులి పట్టణంలో ఉన్న కెనరా బ్యాంకు ప్లాన్‌ ప్రకారం బ్యాంక్‌లోని 58.97 కిలోల బంగారు ఆభరణాలు, కొంత మేర నగదును ఎత్తుకెళ్లారు.

ఈ కేసుపై సూపరింటెండెంట్ లక్ష్మణ్ నింబార్గి మాట్లాడుతూ.. ఈ కేసులో అధికారులను తప్పుదోవ పట్టించేందుకు నిందితులు విశ్వ ప్రయత్నాలు చేశారని.. “దర్యాప్తుపై పోలీసుల దృష్టి మళ్లించేందుకు అనేక ఫేక్ వీడియోలను సృష్టించినప్పటికీ కేసును ఛేదించగలిగామని ఆయన తెలిపారు. నిందితుల్లో ఒకరైనా కెనరా బ్యాంక్ మనగులి పట్టణ శాఖలో మేనేజర్‌గా పనిచేస్తున్న మిరియాల విజయ్‌కుమార్ మే 9న విజయపుర జిల్లాలోని రోనిహాల్ శాఖకు ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. అయితే ఇతను ఈ బ్యాంక్‌లో ఉన్నప్పుడే చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇప్పుడు దొంగతనానికి పాల్పడి సమస్యలు వస్తాయని బ్యాంక్‌ నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యేంత వరకు వేచిచూశాడు. అంతే కాకుండా బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్న సమయంలోనే విజయ్ కుమార్ బ్యాంకు లాకర్‌కు సంబంధించిన కొన్ని తాళాలను ఇతర నిందితులకు ఇచ్చి, నకిలీ తాళాలు తయారు చేయించాడు. ఆ తాళాలు పనిచేస్తాయో లేదో కూడా అతను పరీక్షించి తనిఖీ చేసినట్టు ఎస్పీ తెలిపారు.

“మేనేజర్‌గా ఉన్న విజయ్ కుమార్ తనకు ఎలాంటి సమస్యలు రాకూడదని దొంగతనం చేయడానికి బదిలీ అయ్యే వరకు వేచి వెయిట్‌ చేశాడు. తను ట్రాన్స్‌ఫర్ అయ్యి బ్యాంక్‌లోకి కొత్త మేనేజర్ వచ్చిన నాల్గవ రోజు అంటే మే 23-24 తేదీలలో దోపిడీ చేయాలని విజయ్‌ ప్లాన్ చేసుకున్నాడు. అయితే మే 23న ఆర్‌సిబి-హైదరాబాద్ ఐపిఎల్ మ్యాచ్ ఉంది. ఆరోజు ఆర్‌సిబి గెలిస్తే, అభిమానులు పటాకులు పేల్చి సంబరాలు చేసుకుంటారు.. ఈ గందరగోళంలో బ్యాంక్‌లోకి వెళ్లి చోరీ చేసినా ఎవరూ పట్టించుకోరని అనుకొన్నారు. కానీ ఆరోజు వాళ్ల ప్లాన్‌ బెడిసికొట్టింది.. వాళ్లు అనుకున్న ఆర్‌సీబీ మ్యాచ్‌ గెలవలేదు. దీంతో అక్కడ ఎలాంటి సంబరాలు జరగలేదు. దీంతో ప్లాన్‌ను తర్వాత రోజుకు మార్చి మే 24న దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బ్యాంక్‌ సమీపంలోని సీసీటీవీని మళ్లించి హై-మాస్ట్ లైట్ కేబుల్‌ను కట్ చేశారు, ”అని ఎస్పీ నింబార్గి వివరించారు.

ఇక ఆరోజైనా అనుకున్న ప్లాన్‌ను విజయవంతం చేయాలని నిందితులు బ్యాంకు కిటికీ పగలగొట్టి లోపలికి ప్రవేశించి, సేఫ్ లాకర్ గది గ్రిల్‌ను పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. ఈ కేసులో నిందితులు పట్టుబడిన తర్వాత వారి నుంచి నేరానికి ఉపయోగించిన 2 కార్లు, రూ. 10 కోట్ల 75 లక్షల విలువైన 10.5 కిలోల బంగారు ఆభరణాలు, కరిగించిన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దొంగలించిన బంగారాన్ని ఈజీగా తరలించేందుకు కరిగించినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో మరింత మంది నిందితులు పాల్గొని ఉండొచ్చని వారిని పట్టుకునే పనిలోనే ఉన్నట్టు ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..