
న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) క్యాంపస్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. కొన్ని అకడమిక్ భవనాలను నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల బృందం తాళాలు వేసినట్టు యాజమాన్యం తెలిపింది. ఇదే సమయంలో సెంట్రల్ లైబ్రరీలోకి ప్రవేశించిన ఆందోళనకారులు, నిరసనలో చేరడానికి ఆసక్తి చూపని విద్యార్థులను బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫిబ్రవరి 22 రాత్రి క్యాంపస్‌లో రెండు విద్యార్థి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ పరిణామాలను విశ్వవిద్యాలయ యాజమాన్యం అత్యంత తీవ్రంగా పరిగణించినట్టు వెల్లడించింది. ప్రజా ఆస్తుల ధ్వంసం, విశ్వవిద్యాలయ సమగ్రతకు భంగం కలిగించే చర్యలను విడుదల చేసిన ప్రకటనలో యాజమాన్యం ఖండించింది. విశ్వవిద్యాలయ నిబంధనలు, నియమావళి ప్రకారం.. బీఎన్‌ఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. క్యాంపస్‌లో శాంతి, శ్రేయస్సు, విద్యా వాతావరణ పరిరక్షణ తమ ప్రధాన బాధ్యత అని పేర్కొంది.
అన్ని వర్గాలూ అనవసర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, క్యాంపస్‌లో శాంతి, సామరస్య వాతావరణం కొనసాగేందుకు సహకరించాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. లేకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రస్తుతం క్లాసెస్, ఇతర విద్యా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయని, అందరూ సహకరించాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనను సంబంధిత అధికారుల అనుమతితో జారీ చేసినట్టు రిజిస్ట్రార్ తెలిపారు.
Statement of the JNU administration dated 23 February 2026. pic.twitter.com/gh7snjgJpU
— Jawaharlal Nehru University (JNU) (@JNU_official_50) February 23, 2026