
Ayodhya Ram Mandir Trust: అయోధ్య రామ మందిరం నిర్వహణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు తొలి పూర్తికాల ప్రధాన కార్యనిర్వహణ అధికారి (CEO)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్ర నియమితులయ్యారు. ట్రస్ట్ సమావేశంలో ఆయన పేరుకు ఆమోదం లభించింది.
భారత వైమానిక దళంలో కీలక బాధ్యతలు నిర్వహించిన జితేంద్ర మిశ్ర.. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో వెస్ట్రన్ కమాండ్‌కు నాయకత్వం వహించారు. ఆయనకు సైనిక పరిపాలన, నాయకత్వం, నిర్వహణలో విస్తృత అనుభవం ఉంది. జితేంద్ర మిశ్రా 39 ఏళ్ల సేవ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు.
జితేంద్ర మిశ్రా భారత వైమానిక దళంలో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ అధికారి. నివేదికల ప్రకారం, ఆపరేషన్ టైగర్ హిల్, ఆపరేషన్ సఫేద్ సాగర్ వంటి కీలక సైనిక కార్యకలాపాల్లో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. తన సర్వీసు కాలంలో ఆయన 18కు పైగా రకాల యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్లను నడిపిన అనుభవం కలిగి ఉన్నారు.
ఈ బాధ్యతలను పరిశీలిస్తే, విమానయానం, సైనిక కార్యకలాపాలు, ఆపరేషనల్ ప్లానింగ్, పరిపాలన, నాయకత్వం వంటి విభిన్న రంగాల్లో జితేంద్ర మిశ్రాకు విస్తృత అనుభవం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, రామ మందిర ట్రస్ట్‌కు CEO నియామక ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 5,585 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అనంతరం అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసి, చివరకు ముగ్గురు అభ్యర్థులతో కూడిన తుది ప్యానెల్‌ను ట్రస్ట్‌కు సమర్పించారు.
రామ మందిర నిర్మాణం, ఆలయ నిర్వహణ, భక్తుల దర్శన వ్యవస్థ, పరిపాలనా వ్యవహారాలు వంటి అంశాలు మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక CEO నియామకం ద్వారా ట్రస్ట్ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.