దొంగలు రూటు మార్చారు. నేరాలకు పాల్పడేందుకు కొత్త పద్ధతిని అవలంభిస్తున్నారు. ఇప్పుడు దొంగలు సూట్లు, బూట్లు, టైలు వేసుకుని దర్జాగా వచ్చి పట్టపగలు చోరీలకు పాల్పడుతూ పారిపోతున్నారు. తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీ వీవీఐపీ ఏరియాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
గోండా పోలీస్ స్టేషన్ పరిధిలోని కంకే రోడ్‌లోని ఓ ప్రముఖ కాంట్రాక్టర్ ఇంట్లో పట్టపగలు దొంగలు చొరబడి రూ.30 లక్షల నగదు, నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో దొంగల గెటప్ చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం పోలీసులు దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోండా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న కాంట్రాక్టర్ యశ్వంత్ సింగ్ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, సంఘటన సమయంలో తాను వర్క్ ప్లేస్ ఉన్నానని చెప్పాడు. అతని భార్య ఇంటికి తాళం వేసి సమీపంలోని పని నిమిత్తం వెళ్లింది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు అతని ఇంటికి చేరుకుని తాళం పగులగొట్టి రూ.30 లక్షలకు పైగా విలువైన వస్తువులను అపహరించారు. ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల్లో ఈ ఇద్దరు దొంగలు కనిపిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫుటేజీలో దొంగలిద్దరూ కార్పొరేట్ అధికారుల్లా సూట్లు, బూట్లు, టైలు ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు గోండా పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని దొంగలపై కేసు నమోదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని విచారణ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. రాజధాని రాంచీలో నెల వ్యవధిలో ఇది వరుసగా మూడో అతిపెద్ద దొంగతనం ఘటన అని పోలీసులు తెలిపారు. అంతకుముందు, 26 డిసెంబర్ 2024 న, రాంచీలోని రాటు పోలీస్ స్టేషన్ పరిధిలో 14 లక్షల రూపాయల దోపిడీ జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 30, 2024న కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ ఇంటి దగ్గర దుండగులు కాల్పులు జరిపి రూ.13 లక్షలు దోచుకున్నారు.
తాజాగా రాజధాని రాంచీలోని వీవీఐపీ ఏరియాల్లో ఒకటైన కంకే రోడ్డులో రూ.30 లక్షలకు పైగా చోరీ జరిగింది. ఈ మూడు వరుస ఘటనలు రాజధానిలో శాంతిభద్రతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రకటించారు. నేరగాళ్లు, లంచం తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే, ఇప్పటివరకు జరిగిన నేరాల్లో అతని వాదన కేవలం కాగితాలపై మాత్రమేనని రుజువైంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..