కేంద్రం సరికొత్త స్కీమ్.. నిరుద్యోగ యువతకు అదిరిపోయే గుడ్ న్యూస్..

విదేశాల్లో ఉద్యోగం చేయాలని ఉందా? జపాన్, జర్మనీ లాంటి దేశాల్లో నెలకు లక్షల్లో జీతం సంపాదించాలనుకుంటున్నారా? అయితే యువత కోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. పైసా ఖర్చు లేకుండా ప్రపంచ స్థాయి శిక్షణ.. ఆ వెంటనే విదేశాల్లో గ్యారెంటీ ఉద్యోగం కల్పించేందుకు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒక సరికొత్త పథకాన్ని మొదలుపెట్టింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కేంద్రం సరికొత్త స్కీమ్.. నిరుద్యోగ యువతకు అదిరిపోయే గుడ్ న్యూస్..
Nsdc Debuts On Nse Social Stock Exchange

Updated on: Oct 23, 2026 | 6:23 PM

పేదరికంలో ఉన్న యువతకు నాణ్యమైన శిక్షణ ఇచ్చి, విదేశాల్లో లక్షల రూపాయల జీతాలు వచ్చే ఉద్యోగాలు కల్పించేందుకు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు చెందిన సోషల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ప్లాట్‌ఫామ్‌పై ఎన్‌ఎస్‌డీసీ అధికారికంగా చేరింది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌధరి నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో గంట మోగించి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేదిక ద్వారా తొలిసారిగా జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ బాండ్లను విడుదల చేయగా.. గ్రామీణాభివృద్ధి సంస్థ నాబార్డ్ రూ.4 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ నిధులతో మధ్యప్రదేశ్‌కు చెందిన వెనుకబడిన తరగతుల పేద యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇచ్చి, జపాన్, జర్మనీ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పించనున్నారు.

ఈ పథకం ఎలా పనిచేస్తుంది?

మొత్తం రూ.11.25 కోట్ల అంచనా వ్యయంతో నడిచే ఈ ప్రాజెక్టులో ఖర్చును మూడు రకాలుగా విభజించారు.

  • 15శాతం ఖర్చు: శిక్షణ తీసుకునే అభ్యర్థులు భరిస్తారు.
  • 35శాతం నిధులు: స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ద్వారా సమీకరించిన పెట్టుబడుల ద్వారా అందుతాయి.
  • మిగిలిన 50శాతం నిధులు: అభ్యర్థులకు విదేశాల్లో ఉద్యోగం వచ్చిన తర్వాతే మధ్యప్రదేశ్ ప్రభుత్వం చెల్లిస్తుంది.

దీనివల్ల ప్రభుత్వ నిధులు సద్వినియోగం కావడంతో పాటు అభ్యర్థికి కచ్చితంగా ఉద్యోగం వచ్చేలా సంస్థలు బాధ్యత తీసుకుంటాయి. అభ్యర్థులను ఎంపిక చేయడం, వారికి వసతితో కూడిన శిక్షణ ఇవ్వడం, విదేశీ భాషలు నేర్పించే ల్యాబ్‌లను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది.

ఎవరికి అవకాశం? జీతాలు ఎంత ఉండొచ్చు?

ఎన్‌ఎస్‌డీసీకి చెందిన ఎన్‌ఎస్‌డీసీ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా అభ్యర్థులకు పూర్తిస్థాయిలో రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తారు. మొత్తం 600 మందికి అవకాశం కల్పిస్తుండగా.. వీరిలో 300 మందిని జపాన్‌కు, మరో 300 మందిని జర్మనీ దేశానికి పంపిస్తారు. రోగులు, వృద్ధుల సంరక్షణ, హోటల్ మేనేజ్‌మెంట్, భవన నిర్మాణం, ఫ్యాక్టరీ తయారీ రంగాల్లో శిక్షణ ఇస్తారు. ఎంపికైన వారికి జపాన్‌లో నెలకు సుమారు రూ.1 లక్ష నుంచి రూ.1.2 లక్షల వరకు, జర్మనీలో ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.1.1 లక్ష నుంచి రూ.3.2 లక్షల వరకు వేతనం లభించే అవకాశముంది.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జయంత్ చౌధరి మాట్లాడుతూ.. భారతదేశ ప్రగతి అనేది దేశ ప్రజలపై చేసే పెట్టుబడులపై ఆధారపడి ఉంటుందన్నారు. “ప్రభుత్వాలు విధానాలను రూపొందించగలవు.. కానీ అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ నిధులు, దాతలు కలిసికట్టుగా పనిచేయాలి. ఆ సామూహిక బాధ్యతను పారదర్శకతతో అనుసంధానించే వేదికే ఈ సోషల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్. నైపుణ్యాల ద్వారా అంతర్జాతీయ ఉపాధిని, స్థిరమైన జీవనోపాధిని సృష్టించేందుకు సహకరించిన నాబార్డ్, ఎన్‌ఎస్‌ఈ, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు’’ అని తెలిపారు. మధ్యప్రదేశ్ వెనుకబడిన తరగతులు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కృష్ణా గౌర్ మాట్లాడుతూ.. ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓబీసీ యువత అంతర్జాతీయ నైపుణ్యాలు సాధించి జపాన్, జర్మనీ దేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు ఈ భాగస్వామ్యం గొప్ప వేదికగా నిలుస్తుందని తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us