AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జవాన్ తల్లికి దక్కని న్యాయం.. కట్ చేస్తే 50 మంది కమాండోలు..!

తన తల్లికి జరిగిన అన్యాయం కోసం ఓ ఐటీబీపీ జవాన్ పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాన్పూర్‌లో వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి చెయ్యి తొలగించాల్సి వచ్చిందని ఆరోపించిన జవాన్‌కు మద్దతుగా 50 మందికి పైగా ఐటీబీపీ సిబ్బంది కమిషనర్ కార్యాలయానికి చేరుకోవడం సంచలనం రేపింది.

జవాన్ తల్లికి దక్కని న్యాయం.. కట్ చేస్తే 50 మంది కమాండోలు..!
Dozens of ITBP personnel
Ram Naramaneni
|

Updated on: May 24, 2026 | 4:09 PM

Share

దేశ సరిహద్దుల్లో తుపాకీ పట్టి కాపలా కాసే జవాన్.. ఈసారి తన తల్లికి న్యాయం కోసం వ్యవస్థ ముందే నిలబడాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్.. శనివారం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఏకంగా 50 మందికి పైగా తుపాకీలతో ఉన్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ కమాండోలు.. పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద కనిపించడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది..! సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవ్వడంతో.. కమిషనరేట్‌ను ITBP చుట్టుముట్టింది అంటూ వార్తలు గుప్పుమన్నాయి. కానీ అసలు కథ ఇంకా భావోద్వేగంగా ఉంది..! ITBP కానిస్టేబుల్ వికాస్ సింగ్ తల్లి.. కాన్పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె కుడి చెయ్యిని తొలగించాల్సి వచ్చిందని కుటుంబం ఆరోపిస్తోంది. తన తల్లికి జరిగిన అన్యాయం గురించి వికాస్ సింగ్ పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా.. ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యం అయిందని.. విచారణ కూడా స్పష్టంగా జరగలేదని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

మే 19న పరిస్థితి మరింత సంచలనంగా మారింది. తన తల్లి తొలగించిన చేతిని థర్మకోల్ బాక్స్‌లో పెట్టుకుని.. వికాస్ సింగ్ నేరుగా కాన్పూర్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాకు చిన్నప్పుడు తన తల్లి ఇదే చేత్తో గోరుముద్దులు తినిపించింది అని అతను కంటతడి పెట్టిన వీడియో దేశవ్యాప్తంగా షాక్‌కు గురిచేసింది. “ఒక జవాన్‌కి కూడా న్యాయం దొరకకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏంటి..?” అంటూ నెటిజన్లు ప్రశ్నించారు.

ఈ ఘటన తర్వాతే ఐటీబీపీ కమాండెంట్ గౌరవ్ ప్రసాద్ రంగంలోకి దిగారు. మా జవాన్ తల్లి కేసులో సరైన విచారణ కావాలి అంటూ ఆయన పోలీస్ కమిషనర్‌ను కలిసి మాట్లాడారు. తనతో పాటు వచ్చిన జవాన్లు, అధికారులు బయటే వేచి ఉన్నారని.. అది ఎలాంటి ముట్టడి కాదని.. కేవలం న్యాయం కోరుతూ జరిగిన భేటీ మాత్రమేనని గౌరవ్ ప్రసాద్ స్పష్టం చేశారు. అక్కడ ఎలాంటి ఘర్షణ జరగలేదని అపోహలు రాకుండా అదనపు సిబ్బందిని అక్కడి నుంచి పంపించామని వెల్లడించారు.

కాన్పూర్ పోలీస్ కమిషనర్ రఘుబీర్ లాల్ కూడా స్పందించారు. “మేమూ జవాన్ తల్లికి న్యాయం జరిగేలా చూస్తాం.. మొదటి మెడికల్ బోర్డు నివేదికపై అసంతృప్తి రావడంతో.. మళ్లీ కొత్త విచారణకు ఆదేశించాం” అని తెలిపారు. ఒక జవాన్ తల్లి కోసం.. మొత్తం ఫోర్స్ నిలబడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా భావోద్వేగ చర్చకు దారి తీసింది!.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us