
ప్రస్తుతం పార్లమెంట్ శీతకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య వాడివేడిగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సామాజిక వేత్త, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి రాజ్యసభలో చూపిన మాతృ ప్రేమకు పార్లమెంటు సభ్యులంతా ఫిదా అయ్యారు. అందరూ బల్లలపై చరుస్తూ హర్షాన్ని వ్యక్తం చేశారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో భారతీయ వాయు యాన్ విధేయక్ బిల్లును ప్రవేశ పెట్టారు. అయితే ఇందుకు సంబంధించి గురువారం జరిగిన చర్చకు శుక్రవారం సమాధానమిస్తూ దప్పికకు గురయ్యారు. దీంతో తనకు మంచినీళ్లు తెప్పించమని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్‌ను కోరారు. వెంటనే ఆయన స్పందించి మంచినీరు తీసుకురావల్సిందిగా అక్కడున్న సిబ్బందిని ఆదేశించారు.
అయితే, రాజ్యసభ సిబ్బంది మంచినీళ్లు తీసుకువచ్చేలోపే, సభలోనే ఉన్న సభ్యురాలు సుధామూర్తి వెంటనే స్పందించారు. తన స్థానం నుంచి లేచి వచ్చి.. తన దగ్గర ఉన్న మంచినీళ్ల బాటిల్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి అందించారు. సుధామూర్తి వాత్సల్యానికి ముగ్ధులైన ఆయన ఆమెకు రెండు చేతులతో నమస్కరించి, ధన్యవాదాలు తెలిపారు. ఆమె ఎప్పుడూ తల్లిలా తన పట్ల ఆదరణ చూపుతున్నారని కృతజ్ఞతలు తెలిపారు రామ్మోహన్ నాయుడు. రాజ్యసభలో సుధామూర్తి చూపిన మాతృ ప్రేమకు సభ్యులందరూ ఫిదా అయ్యారు.. నిజంగా ఆమె సింప్లిసిటీ గ్రేట్ అంటూ మెచ్చుకున్నారు.
73 ఏళ్ల సుధామూర్తి ప్రస్తుతం మూర్తి ట్రస్ట్‌కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. రచయిత్రిగా, విద్యావేత్తగా, సామాజిక వేత్తగా దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందారు. వేల కోట్లకు అధినేత అయినా.. సింప్లీ సిటీకి మారుపేరులా ఉంటారు. ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా పలు అనాథాశ్రయాలను నెలకొల్పారు. గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్రం పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..