PM Modi – Putin: పుతిన్‌కు భగవద్గీత అందించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?

రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భగవద్గీత ప్రతిని బహుమతిగా ఇచ్చారు. అధ్యక్షుడు పుతిన్‌కు బహూకరించిన కాపీ రష్యన్ భాషలో ప్రచురించారు. ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్ చేస్తూ.. గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.

PM Modi - Putin: పుతిన్‌కు భగవద్గీత అందించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?
PM Modi Gifts Russian Edition Of Bhagavad Gita To Vladimir Putin

Updated on: Dec 05, 2025 | 8:45 AM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలం ఎయిర్‌పోర్టులో పుతిన్ కు ఘన స్వాగతం పలికారు. ఆప్యాయంగా పుతిన్‌ను ఆలింగనం చేసుకున్నారు. పుతిన్‌కు మోదీ స్వాగతం పలుకుతారని ఊహించలేదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ ప్రకటించింది. అనంతరం అక్కడి నుంచి ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రధాని అధికారిక నివాసానికి చేరుకున్నారు. పుతిన్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇచ్చారు. రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భగవద్గీత ప్రతిని బహుమతిగా ఇచ్చారు. అధ్యక్షుడు పుతిన్‌కు బహూకరించిన కాపీ రష్యన్ భాషలో ప్రచురించారు. ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్ చేస్తూ.. గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.

“రష్యన్ భాషలో గీత ప్రతిని అధ్యక్షుడు పుతిన్‌కు బహూకరించాను. గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయి” అని ప్రధాని మోదీ Xలో పోస్ట్ చేశారు.

పుతిన్ శుక్రవారం షెడ్యూల్ ఇదే..

పుతిన్ ఈరోజు ఢిల్లీలోని వివిధ ప్రదేశాలలో అనేక సమావేశాలు – సందర్శనలతో బిజీగా ఉండనున్నారు.

ఉదయం 11 గంటలకు పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో స్వాగతం లభిస్తుంది. 11:30 గంటలకు ఆయన రాజ్ ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచుతారు. ఆ తర్వాత, ఆయన హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు, అక్కడ ఇద్దరు నాయకుల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగనుంది. భారత్‌-రష్యా మధ్య 25 ఒప్పందాలు జరగనున్నాయి. ప్రధాని మోదీ- రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇండియా-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

మధ్యాహ్నం 1:50 గంటలకు, హైదరాబాద్ హౌస్‌లో ఉమ్మడి పత్రికా ప్రకటనలు విడుదల చేయనున్నారు. అక్కడ రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు – దౌత్య సంబంధాల గురించి మీడియాకు తెలియజేయనున్నారు.

మధ్యాహ్నం 3:40 గంటలకు, అధ్యక్షుడు పుతిన్ ఒక వ్యాపార కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఆయన భారతదేశంలోని కీలక వ్యాపార నాయకులతో సంభాషించే అవకాశం ఉంది.

రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పుతిన్ భేటీ అవుతారు.

రాత్రి 9 గంటలకు ఆయన రష్యాకు బయలుదేరి వెళతారు.