Farmers Protest – MLA Abhay Singh Chautala Resigns: కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలకుపైగా అన్నదాతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారి నిరసనలకు మద్దతుగా హర్యానాకు చెందిన ఎమ్మెల్యే రాజీనామా చేశారు. రైతుల ఆందోళనకు సంఘీభావంగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నాయకుడు అభయ్‌సింగ్ చౌతలా వెల్లడించారు. ఎల్లెనాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అభయ్‌సింగ్ చౌతలా ఐఎన్‌ఎల్‌డి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా చిన్న కుమారుడు. మొదటినుంచి ఆయన కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ఢిల్లీలో జరిగిన హింసాకాండ అనంతరం కలత చెందిన చౌతాలా రైతులకు మద్దతుగా రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేశారు.
దీంతో ఆయన రాజీనామాకు హర్యానా అసెంబ్లీ స్పీకర్ జియాన్ చంద్ గుప్తా బుధవారం ఆమోదం తెలిపారు. ఎల్లెనాబాద్ నియోజకవర్గానికి చెందిన అభయ్ సింగ్ చౌతాలా తనను కలుసుకుని రాజీనామా సమర్పించగా దానిని ఆమోదించినట్లు స్పీకర్ వెల్లడించారు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన అభయ్ చౌతాలా.. ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసకు బీజేపీనే కారణమని ఆరోపించారు. కేంద్రం కావాలనే రైతులను వేధిస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా వ్యవసాయచట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Read also :రైతుల నిరసనకు మద్దతు, పార్లమెంటరీ కమిటీలకు ఆర్ ఎల్ పీ చీఫ్ హనుమాన్ బెనివాల్ రాజీనామా, స్పీకర్ కు లేఖ.