న్యూయార్క్, మార్చి 27: భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త డాక్టర్ టీఎన్ సుబ్రమణ్యం (76) మంగళవారం కన్నుమూశారు. అమెరికాలోని మిషిగన్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ సర్వర్ కోసం రూట్ వన్ కంపెనీని స్థాపించి ప్రసిద్ధి గాంచారు. భారత సంతతికి చెందిన సుబ్రమణ్యం విద్యారంగంలో ఎనలేని కృషి చేశారు. సుబ్రమణ్యం భారత్, అమెరికా.. రెండు దేశాల్లో గొప్ప విద్యావేత్తగా పేరుగాంచారు. గణిత శాస్త్రంలో అద్భుతమైన పలు నమూనాలు, సిద్ధాంతాలను ఆయన రూపొందించారు. కొన్నేళ్లు ఫిలడెల్ఫియా యూనివర్సిటీలో, ఆ తర్వాత ఓక్లాండ్‌లో గణిత అధ్యాపకులుగా కూడా ఆయన పనిచేశారు.
అనంతరం ఆటోమోటిక్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ కోసం రూట్ వన్ కంపెనీని స్థాపించారు. అన్ని GM కార్లు, GPS సిస్టమ్‌లకు ఆటో-ఫైనాన్సింగ్‌ను రూపొందించింది ఆయనే. యుఎస్‌లోని మిచిగాన్‌లోని ట్రాయ్‌లోని జనరల్ మోటార్స్ సైట్ సర్వర్ వెనుక సూత్రధారి కూడా ఆయనే. అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కూడా సుబ్రమణ్యం ప్రతిభను కొనియాడారు. వినూత్నమైన ఆవిష్కరణలు కొనసాగించమని ఆయనను ప్రోత్సహించారు.
కాగా డా. సుబ్రమణ్యానికి భార్య, కుమార్తె, అల్లుడు ఉన్నారు. ఆయన భార్య అమెరికాలోని మేరీల్యాండ్‌లో బిడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేస్తున్నారు. అయన తమ్ముడు TN అశోక్ అంతర్జాతీయ బ్లాగర్. ఆయన ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మాజీ ఎడిటర్ (ఎకనామిక్స్)గా కూడా పనిచేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.