పాకిస్థాన్‌కు మరో షాకిచ్చిన భారత్‌..! ఒక్క బుల్లెట్‌ వేస్ట్‌ కాకుండానే పాక్‌ను అల్లాడిస్తున్న ప్రధాని మోదీ

పాకిస్తాన్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని వాయిదా వేసింది. బగ్లిహార్, కిషన్‌గంగా ఆనకట్టల ద్వారా పాకిస్తాన్‌కు వెళ్ళే నీటి ప్రవాహాన్ని భారత్ నియంత్రిస్తోంది. పాకిస్తాన్‌కు సింధు జలాలు వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తికి అత్యవసరం. ఈ నిర్ణయం పాకిస్తాన్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచుతుంది.

పాకిస్థాన్‌కు మరో షాకిచ్చిన భారత్‌..! ఒక్క బుల్లెట్‌ వేస్ట్‌ కాకుండానే పాక్‌ను అల్లాడిస్తున్న ప్రధాని మోదీ
Baglihar Dam

Updated on: May 04, 2025 | 3:54 PM

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, పాకిస్తాన్‌తో 65 ఏళ్ల నాటి సింధు జల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. పాకిస్తాన్‌కు గుణపాఠం నేర్పడానికి ఇండియా దౌత్యపరంగా తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం.. చీనాబ్ నదిపై ఉన్న బగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్తాన్‌కు వెళ్లే నీటి ప్రవాహాన్ని భారత్‌ నిలిపివేసింది. జీలం నదిపై ఉన్న కిషన్‌గంగా ఆనకట్ట వద్ద కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

జమ్మూలోని రాంబన్‌లోని బాగ్లిహార్ జలవిద్యుత్ ఆనకట్ట, ఉత్తర కశ్మీర్‌లోని కిషన్‌గంగా జలవిద్యుత్ ఆనకట్ట ద్వారా ఇండియా తన వైపు నుండి నీటి విడుదల సమయాన్ని నియంత్రించగలదు. అంటే ఈ ఆనకట్టల ద్వారా పాకిస్తాన్‌కు చేరే నీటిని ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా తగ్గించవచ్చు, అవసరం అయితే ప్రవాహాన్ని కూడా పెంచవచ్చు. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో ఇండియా, పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందం కుదిరింది. దీని కింద, సింధు నది, దాని ఉపనదుల నీటిని రెండు దేశాల మధ్య విభజించాలని నిర్ణయించారు. చీనాబ్ నదిపై నిర్మించిన బగ్లిహార్ ఆనకట్ట కూడా రెండు పొరుగు దేశాల మధ్య చాలా కాలంగా వివాదానికి దారితీసింది. ఈ విషయంలో పాకిస్తాన్ గతంలో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం కోరింది. అదేవిధంగా కిషన్‌గంగా ఆనకట్ట కూడా చట్టపరమైన. దౌత్యపరమైన పరిశీలనను ఎదుర్కొంది.

పాకిస్థాన్‌కు సింధు వ్యవస్థ ఎందుకంత ముఖ్యమైనది?

ఈ ఒప్పందం ప్రకారం.. సింధు వ్యవస్థ పశ్చిమ నదుల(సింధు, చీనాబ్, జీలం) పై పాకిస్తాన్‌ నియంత్రణ కలిగి ఉంది. పాకిస్తాన్ సింధు నది వ్యవస్థలోని నీటిలో దాదాపు 93 శాతం నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తుంది. 80 శాతం వ్యవసాయ భూమి కూడా సింధు జలాలపైనే ఆధారపడి ఉంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ కారణంగానే ఒప్పందం వాయిదా పడిన తర్వాత పాకిస్తాన్ బెంబేలెత్తి పోతోంది. నీళ్లను ఆపితే యుద్ధం చేస్తామంటూ బెదిరింపులకు దిగుతోంది. ఒప్పందం వాయిదా వేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించగానే.. పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. ‘మా నీళ్లు సింధు నదిలో ప్రవహిస్తాయి, లేదా వారి రక్తం ప్రవహిస్తుంది’ అని అన్నారు. ఈ ప్రకటనపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఒప్పందాన్ని వాయిదా వేసే నిర్ణయాన్ని పాకిస్తాన్ రాజకీయ నాయకులు ప్రత్యక్ష యుద్ధ ప్రకటనగా భావిస్తామని హెచ్చరించారు. వీటితో వారికి సింధు జలాలు ఎంత ముఖ్యమైనవో అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి