కేరళ లోని వయనాడు అంతులేని విషాదానికి కేంద్రబిందువుగా మారింది. వరుసగా మూడోరోజు సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతంలో తవ్విన కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. వయనాడ్ ప్రాంతంలో చేపట్టిన సహాయక చర్యలు ఒకట్రెండు రోజుల్లో పూర్తయ్యేవి కావని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అన్నారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ధ్వంసమైన వయనాడ్‌లోని మెప్పాడి- చురల్మల ప్రాంతంలో సైన్యం తాత్కాలిక బ్రిడ్జి నిర్మించింది. సైన్యానికి చెందిన మద్రాస్ ఇంజినీర్ గ్రూప్ దాదాపు 150 అడుగుల వంతెనను నిర్మించింది. 123 మంది సైనికులు దీని కోసం అహోరాత్రులు శ్రమించారు. ఈ బ్రిడ్జి ద్వారా రాకపోకలకు మార్గం సుగమమవుతుంది. సహాయ సామగ్రి, నిత్యావసర వస్తువులు తరలించేందుకు సహాయక సిబ్బందికి వీలు కలుగుతుంది.