రైతులకు సూపర్ గుడ్ న్యూస్.. ఈసారి కుండపోత వానలు ఖాయం..
వర్షాలే.. వర్షాలు.. ఈ సారి.. కుండపోత వానలు ఖాయమంటున్న వాతావరణ శాఖ.. ఎస్.. రైతులకు IMD శుభవార్త చెప్పింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గతంలో కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని ప్రకటించింది. ఆ వివరాలు..

దేశానికి ఈ ఏడాది రుతుపవనకాలం ఆశాజనకంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ భావిస్తోంది. దేశవ్యాప్తంగా సాధారణం కన్నా అధిక వర్షపాతం రికార్డ్ అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రధానంగా.. జూన్ నుంచి సెప్టెంబరు వరకు దేశంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర. ఈసారి 105 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించారు. దీర్ఘకాలిక సగటు 87 సెంటీ మీటర్లుగా ఉండగా.. ఈసారి అంతకన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. ఈ సారి ఎల్‌నినో లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని భావిస్తున్నట్లు చెప్పారు.
ఇక.. ఇప్పటికే.. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా ఇటీవల ఈ ఏడాది వాతావరణ పరిస్థితులపై రిపోర్ట్ ఇచ్చింది. వచ్చే నైరుతి సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో మాత్రం అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నైరుతి సీజన్ నెమ్మదిగా ప్రారంభమైనా మధ్యలో వర్షాలు వేగం పుంజుకోనున్నాయని పేర్కొంది. పశ్చిమ, దక్షిణ భారతదేశంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని స్కైమెట్ అంచనా వేసింది.