
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలంగా, స్థిరంగా పెరుగుతున్నదని తాజా సూచకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎకో సిస్టమ్.. వేగంగా విస్తరిస్తుండడం ఈ వృద్ధికి అద్దం పడుతోంది. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసులు (PMS), అల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (AIF) వంటి పెట్టుబడులు గత 10 ఏళ్లలో 31.24% CAGR తో పెరుగుతున్నాయి. 2015లో ఈ పెట్టుబడులు రూ. 1.54 లక్షల కోట్లు ఉండగా.. 2025లో పరాయ పెట్టుబడులు: రూ. 23.43 లక్షల కోట్లకు చేరాయి.
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక పరిస్థితులు, అనిశ్చితులు పెట్టుబడిదారులను సంప్రదాయ ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి బయటకు నడిపించి, కొత్త ప్రత్యామ్నాయాల వైపు మళ్లించాయి. స్టార్టప్ వ్యవస్థాపకులు, ప్రొఫెషనల్స్, యువ పెట్టుబడిదారులు మాత్రమే కాదు… చిన్న పట్టణాల్లో కూడా ఆల్టర్నేటివ్ పెట్టుబడులపై ఆసక్తి భారీగా పెరుగుతోంది. PMS పరిశ్రమ పదేళ్లలో 1.27 లక్ష కోట్ల నుంచి 8.37 లక్షల కోట్లుకు ఎగబాకింది అంటే.. ఎంత డెవలప్‌మెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. AIF పరిశ్రమ రంగం కూడా 49.23% CAGRతో అత్యంత వేగంగా విస్తరణ చెందింది.
ఇక దేశంలో గృహ వినియోగ వంట గ్యాస్ వినియోగం కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) తాజా గణాంకాల ప్రకారం 2024–25లో దేశవ్యాప్తంగా గృహ LPG వినియోగం 31.3 మిలియన్ మెట్రిక్ టన్నులకు (MMT) చేరింది. ఇది కేవలం డిమాండ్ పెరుగుదలకే సంకేతం కాదు… సురక్షిత, శుభ్రమైన వంట ఇంధనాల వైపు దేశం మొగ్గు చూపుతున్నట్టు కూడా సూచిస్తోంది.
గత ఇరవై ఏళ్లలో దేశంలో LPG వినియోగం దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2004–05లో 10.2 MMT, 2013–14లో 16.3 MMT ఉండగా.. పెద్ద ఎత్తున పెరుగుదల గత దశాబ్దంలోనే నమోదైంది. 2024–25 నాటికి వినియోగం 31.3 MMTకి చేరి… 2013–14తో పోలిస్తే రెండింతలకు పైగా పెరిగింది. మోదీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా LPG కనెక్షన్ల విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఉజ్వల పథకం ద్వారా గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో వంట గ్యాస్‌ను వినియోగించడం ప్రారంభించాయి. అదనంగా దేశంలో LPG సరఫరా వ్యవస్థ గణనీయంగా బలోపేతమైంది. రిఫైనరీ సామర్థ్యం పెరగడం, పెద్ద గోదాములు, మెరుగైన పంపిణీ నెట్వర్క్ కారణంగా గ్యాస్ రీఫిల్ అందుబాటు సులభమైంది. ఇటీవలి కాలంలో LPG ధరలు తగ్గటం కూడా డిమాండ్‌పై ప్రభావం చూపింది.
ఈ నెలలో గృహ LPG ధరల్లో మార్పు లేకపోయినా, కమర్షియల్ గ్యాస్ ధరలు మాత్రం తగ్గాయి. IOCL ప్రకారం, నెల మొదటి తేదీ నుంచి నాలుగు ప్రధాన నగరాల్లో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలో రూ.10 తగ్గింపు జరిగింది. వరుసగా రెండో నెల ఇదే విధంగా తగ్గుదల నమోదైంది.