యుద్ధంతో అల్లాడిపోతున్న గాజాకి సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. భారీ ఎత్తున వైద్య సాయం అందించింది. అక్కడి ప్రజలకు అవసరమైన వాటిని ప్రత్యేక ఫ్లైట్‌లో పంపింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది. లైఫ్ సేవింగ్ మెడిసిన్స్‌తో పాటు సర్జికల్ ఐటమ్స్, టెంట్స్ పంపుతోంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన C-17 ఫ్లైట్‌లో వీటిని పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.
మొత్తంగా 6.5 టన్నుల మెడికల ఎయిడ్, 32 టన్నుల డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్ పంపింది. గాజా, ఈజిప్టుల మధ్య ఉన్న రఫా సరిహద్దును శనివారం తెరిచారు. 20 లారీల్లో సహాయక సామగ్రి గాజాలోకి ప్రవేశించింది. వాటిని చిన్న ట్రక్కుల్లో అవసరమైన ప్రాంతాలకు పంపనున్నారు. ఇంకా దాదాపు 200 లారీల సహాయక సామగ్రి సరిహద్దుల వద్ద వేచి చూస్తోంది. రాబోయే రోజుల్లో వాటినీ గాజాలోకి పంపనున్నారు. ఘర్షణ మొదలయ్యాక గాజాలోకి సహాయక సామగ్రి చేరడం ఇదే తొలిసారి. గాజాను వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ బలగాలు మరోసారి హెచ్చరించాయి.
తమ డెడ్‌లైన్‌ను పట్టించుకోకుండా గాజాలో ఉన్న వాళ్లందరిని టెర్రరిస్టులుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. వైమానిక దాడులను కూడా మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజాను హమాస్ నుంచి విముక్తి చేయడానికి ఇజ్రాయెల్ బలగాలు మూడంచెల ఆపరేషన్‌ను చేపట్టాయి. హమాస్ నుంచి నుంచి గట్టి ప్రతిఘటన తప్పదని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే ఇజ్రాయెల్ బలగాల దాడులను తిప్పికొట్టేందుకు హమాస్ బలగాలు కూడా కొత్త వ్యూహంతో ముందుకెళ్తునట్టు తెలుస్తోంది.
ఐడీఎఫ్ వైమానిక దాడులు మొదటి దశలో ఉన్నాయి. రెండో దశలో భాగంగా గాజాలోకి ప్రవేశించి భూతల దాడులు జరపనుంది. చివరగా ‘సెక్యూరిటీ రిజీమ్’ను మార్చనుంది. భూతల దాడుల కోసం ఇజ్రాయెల్ ఇప్పటికే వేలాది మంది సైనికులను సిద్ధం చేసింది. ఇజ్రాయెల్‌పై రెండు వారాల క్రితం హమాస్ జరిపిన దాడిలో 1,400 మంది చనిపోయారు. మరో 210 మందిని బందీలుగా చేసుకున్నారు. ఇజ్రాయెల్ ప్రతిదాడిలో ఇప్పటి వరకు 4,385 మంది చనిపోయారు. ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య గత 15 రోజులుగా యుద్దం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సహాయం అందించేందుకు భారతదేశం ముందుకు వచ్చింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..