Temperature: ఈ సంవత్సరం వేసవికాలంలో ఎండల తీవ్రత భాగా ఉంది. భానుడు ప్రజలపై నిప్పులు కురిపిస్తున్నాడు. దీనివల్ల అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, దీనికి తోడు కరెంటు కోతలు(Power cuts) తోడుకావటంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఈ సంవత్సరం వేసవి ఉష్ణోగ్రతలు ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయికి పెరుగుతున్నాయి. మార్చిలో దేశవ్యాప్తంగా సగటు(Average Temperature) గరిష్ఠ ఉష్ణోగ్రత 33.10 డిగ్రీలుగా నమోదైంది. భారత వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరం మార్చి నెలలో ఉష్ణోగ్రతలు 122 ఏళ్లలో నమోదైన వాటికంటే అత్యంత ఎక్కువైనవిగా పేర్కొంది. దీనిని బట్టి వాతావరణంలో మార్పులు చాలా వేగంగా వస్తున్నట్లు మనం అర్థం చేసుకోవాలి.
ఢిల్లీ మార్చి నెలలో ఇంతకు ముందు ఎప్పూడూ చూడని విధంగా రెండు హీట్‌వేవ్స్ ను చూసింది. సగటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32.9°C (సాధారణ సగటు కంటే 3.3°C), 17.6°C (సాధారణ సగటు కంటే 2°C) వద్ద సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు హీట్‌వేవ్ రోజుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత గణాంకాలను చూసినట్లయితే 1981-90లో 413 రోజుల నుంచి 2001-10లో 575 రోజులకు, 2011-20 మధ్యలో ఇది 600 రోజులకు పెరిగింది. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ అని నిపుణులు అంటున్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న నగరీకరణ, అడవుల నరికివేత వంటివి కూడా మారుతున్న వాతావరణ తీవ్రతలకు దోహదపడ్డాయని వారు చెబుతున్నారు. వీటికి తోడు దేశ వ్యాప్తంగా నమోదవుతున్న తక్కువ వర్షపాతం మరో కారణంగా తెలుస్తోంది. వర్షపాతం లోపం భారత్ లో 72 శాతం ఉండగా.. దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో అది అత్యధికంగా 89 శాతానికి పెరిగింది. ఆకాశంలో మేఘాలు లేనందున సూర్యుని కిరణాలు నేరుగా భూమిపై పడుతున్నాయి. దీని వల్ల ఉష్ణోగ్రతలు ఊహించిన స్థాయికంటే ఎక్కువగా ఉంటున్నాయి. పొడి, వేడి గాలులు వాయువ్య, మధ్య భారతదేశంలోకి వీస్తున్నాయి.
1960 – 2009 మధ్య కాలంలో భారతదేశ సగటు ఉష్ణోగ్రత 0.5°C పెరగడం కారణంగా వడగాల్పుల వల్ల సంభవించిన మరణాలు 146 శాతం వరకు పెరిగాయి. దేశంలోని 13 శాతం జిల్లాలు, 15 శాతం ప్రజలు ఈ హీట్‌వేవ్‌లకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని వల్ల పేదలు, అట్టడుగు వర్గాలు తీవ్రంగా ప్రభావితం కానున్నారు. దేశంలోని శ్రామిక-వయస్సు జనాభాలో అధిక శాతం మంది వ్యవసాయం, నిర్మాణం, రిక్షా లాగడం వంటి బహిరంగ ఉద్యోగాల్లో ఉండటం వల్ల వారిపై వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వారి ఆరోగ్యం దెబ్బతినటంతో పాటు, జీవనోపాధికి ముప్పు కలిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Child Care: చిన్నారులకు పొరపాటున కూడా ఈ ఆహారాలు తినిపించకూడదు.. చాలా ప్రమాదం..!