India vs Pakistan: పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోన్న భారత్..

పాక్‌ ప్రయోగించిన ఎనిమిది మిసైల్స్‌ను భారత సైన్యం వీరోచితంగా కూల్చేసింది. పాక్‌ దాడుల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. పాక్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టామని రక్షణశాఖ వెల్లడించింది. మరోవైపు పాక్ దాడులతో కౌంటర్‌ అటాక్‌ స్టార్ట్‌ చేసింది భారత్‌. పాకిస్తాన్‌లో లాహోర్‌, సియోల్‌కోట్‌తో పాటు ఇస్లామాబాద్‌, బహల్‌వాల్‌పూర్‌లోనూ దాడులు చేసింది.

India vs Pakistan: పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోన్న భారత్..
India Vs Pak

Updated on: May 08, 2025 | 11:47 PM

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో భారతదేశం గురువారం పాకిస్తాన్‌లోని లాహోర్, ముల్తాన్, సర్గోధా, ఫైసలాబాద్‌లలో వైమానిక రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. అంతకుముందు, పాకిస్తాన్ భారతదేశంలోని అనేక ప్రదేశాలపై దాడులు చేయడానికి ప్రయత్నించింది.  వాటిని భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలు విఫలం చేశాయి. గురువారం రాత్రి పాకిస్తాన్ డ్రోన్లు,  క్షిపణులతో భారతదేశ పశ్చిమ సరిహద్దుల్లోని వివిధ ప్రదేశాలను అటాక్ చేయడానికి ప్రయత్నించింది. కానీ అది విజయవంతం కాలేదని భారత సైనిక అధికారులు తెలిపారు.

జమ్మూ, పఠాన్‌కోట్ , ఉధంపూర్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నించిందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ డ్రోన్‌లను భారత సాయుధ దళాలు సమర్థవంతంగా నేలమట్టం చేశాయని.. వివరించారు.

బుధవారం రాత్రి కూడా అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, అడంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తర్‌లై, భుజ్‌లను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం దాడికి పాల్పడిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే భారత్ పాక్‌ కుటిల యత్నాలకు చెక్ పెట్టింది.

మంగళవారం రాత్రి  భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె),  పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ కౌంటర్ అటాక్ ప్రయత్నాలు చేసింది. కానీ భారత్ దాయాది దేశాన్ని నిలువరించింది.

“మే 7-8 రాత్రి, పాకిస్తాన్… ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరలై, భుజ్‌ ప్రాంతాల్లో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోని డ్రోన్లు, క్షిపణులను ప్రయత్నించింది” అని మంత్రిత్వ శాఖ తెలిపింది. “వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS (మానవరహిత విమాన వ్యవస్థ) గ్రిడ్,  వాయు రక్షణ వ్యవస్థలు నేలమట్టం చేశాయని” అని ఒక ప్రకటనలో వెల్లడించింది.