చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియా మరింత అప్రమత్తమైంది. అమెరికా నుంచి అత్యవసరంగా అధునాతన వార్ ఫేర్ కిట్స్ ను కొనుగోలు చేస్తోంది. భారత-చైనా దేశాల మధ్య చర్చలు దాదాపు నిలిచిపోవడంతో ఇక శీతాకాలంలో లడాఖ్ సరిహద్దుల్లో సైనిక మోహరింపును పెంచాలని కూడా ఇండియన్ ఆర్మీ భావిస్తోంది. యుధ్ధ నౌకలకు, విమానాలకు అవసరమైన విడిభాగాలు, ఇంధనం కొనుగోలుకు సంబంధించి భారత-అమెరికా దేశాలమధ్య ఇదివరకే ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద ఈ వార్ ఫేర్ కిట్స్ కొనుగోలుపై ఇండియా దృష్టి పెట్టింది. 2016 లో ఈ ఉభయ దేశాల మధ్య ‘లాజిస్టిక్ ఎక్స్ చేంజ్ మెమోరాండం అగ్రమెంట్’ కుదిరిన విషయాన్ని సైనికవర్గాలు గుర్తు చేశాయి. ఇప్పటికే లడాఖ్ బోర్డర్లో మన ఫైటర్ జెట్ విమానాలు రెడీగా ఉన్నాయి. అయితే ఇది చాలదని, మరిన్నిఅధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వార్ ఫేర్ సామగ్రి అవసరమని ఈ వర్గాలు భావిస్తున్నాయి.