
దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 13వసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంపై కీలక ప్రకటనలు చేశారు. ప్రసంగం ముగిసిన తర్వాత ఎర్రకోట ప్రాంగణంలోకి వెళ్లిన మోదీ.. అక్కడ ఉన్న చిన్నారులు, ఎన్‌సీసీ క్యాడెట్లను కలుసుకుని వారితో కరచాలనం చేశారు. పిల్లలతో ఎంతో ఉత్సాహంగా ముచ్చటిస్తూ వారిని అభినందించారు.
తన 13వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో యువతను దేశ అభివృద్ధికి ప్రధాన శక్తిగా ప్రధాని అభివర్ణించారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు యువతలోని ప్రతిభ, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా యువతకు సంబంధించి ప్రధాని కీలక ప్రకటన చేశారు. ఏడాదిలోగా కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు, యువత కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ సదుపాయాలను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఆర్థిక అవకాశాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేయడమే లక్ష్యమన్నారు.
భారత్‌లోనే ఉంటూ విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు పొందే అవకాశాలను కల్పించే విధానాలను తీసుకొస్తున్నట్లు మోదీ తెలిపారు. చిన్న వయస్సు నుంచే పిల్లల్లో టెక్నాలజీ, ఇన్నోవేషన్‌పై ఆసక్తి పెంచేందుకు దేశవ్యాప్తంగా 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. యువత కోసం కొత్త అవకాశాలకు మార్గాలు తెరుస్తున్నామని చెప్పారు.
ఇదే సమయంలో 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు తన ‘శక్తి సప్తధార’ సూత్రాన్ని ప్రధాని వివరించారు. తయారీ, వ్యవసాయం-ఆహార శుద్ధి, టెక్నాలజీ-ఇన్నోవేషన్, గతి శక్తి, రక్షణ, గ్రీన్-బ్లూ ఎకానమీ, యువశక్తి-సాఫ్ట్ పవర్ వంటి ఏడు రంగాల సమిష్టి బలంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని మోదీ స్పష్టం చేశారు. ఈ ఏడు శక్తుల సమన్వయంతో భారత్ ప్రపంచంలో మరింత బలమైన ఆర్థిక, సాంకేతిక శక్తిగా ఎదిగి.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యాన్ని సాధిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
VIDEO | PM Modi (@narendramodi) waves to and shakes hands with youth gathered at the Red Fort before leaving the venue.
(Source: Narendra Modi YT)#IndependenceDay
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) pic.twitter.com/9ba18wiibs
— Press Trust of India (@PTI_News) August 15, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..