West Bengal Election 2021: బీజేపీ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ నిజస్వరూపం బయటపడిందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఆ రాష్ట్ర బీజేపీ మేనిఫెస్టోని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ మేనిఫెస్టోలో శరణార్ధులకు నెలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొన్నారు. ఇదే అంశంపై చిదంబరం తీవ్రంగా స్పందించారు. సోమవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. పశ్చిమ బెంగాల్ మేనిఫెస్టోలో బీజేపీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుందని దుయ్యబట్టారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. తొలి రోజే ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం అమలుకు ఆమోదం తెలుపుతుందని వ్యాఖ్యానించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకురాదల్చిన సీఏఏ చట్టం దేశాన్ని విభజిస్తుంది. ముస్లింలపై వివక్ష చూపుతుంది. లక్షలాది మంది భారతీయులు వారి పౌరసత్వాన్ని కోల్పోతారు. లక్షలాది మంది పేద, చట్టాన్ని గౌరవించే పౌరులు, ముఖ్యంగా ముస్లింల మనస్సులో భయపెట్టడం ఈ సీఏఏ ఉద్దేశం. నిర్బంధ శిబిరాల్లో వేస్తారు’ అని చిదంబరం వ్యాఖ్యానించారు. బీజేపీ ‘విష అజెండా’ను అడ్డుకోవడానికి అస్సాం, బెంగాల్ ప్రజలు నిర్ణయాత్మకంగా ఓటు వేయాలని చిదంబరం ఆయా రాష్ట్రాల ప్రజలను కోరారు.
ఇదిలాఉండగా.. ఆదివారం నాడు పశ్చిమబెంగాల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు. తామె అధికారంలోకి రాగానే సీఏఏ ని అమలు చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. ‘మేము మా మేనిఫెస్టోని ‘సంకల్ప్ పాత్ర’ అని పిలవాలని నిర్ణయించుకున్నాము. ఇది కేవలం మేనిఫెస్టో మాత్రమే కాదు. ‘సోనార్ బంగ్లా’ బీజేపీ మేనిఫెస్టో గుండె’ అని అమిత్ షా పేర్కొన్నారు. ఇదే సమయంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అమిత్ షా నిప్పులు చెరిగారు. నేరపూరిత రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అవినీతి పాలన తాండవిస్తోందని, ఎన్నికల్లో తృణమూల్ పార్టీని ఓడించాలని ప్రజలకు అమిత్ షా పిలుపునిచ్చారు.
Also read: