Jharkhand: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఏమాత్రం భయం లేకుండా మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో నిర్భయ తరహా ఘటన వెలుగు చూసింది. ఏకంగా ఓ డీఎస్పీ ఈ దారుణాన్ని అడ్డుకుని, మైనర్ బాలికను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాంచీలో గురువారం సాయంత్రం ఓ బాలిక ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. బాలికపై కన్నేసిన ఐదుగురు కామాంధులు.. తమ కారుతో ఆమెను వెంబడించారు. కొంత దూరం వెళ్లాక.. అడ్రస్ పేరుతో మాట కలిపారు. చుట్టూ ఎవరూ లేనిది గమనించి.. కారులోకి బలవంతంగా లాక్కెళ్లారు. కారులో తిప్పుతూనే బాలికపై అత్యాచారం చేశారు. ఆ తరువాత రాతూ స్టేషన్ సమీపంలోని ఓ రెస్టారెండ్ వద్ద కారును ఆపి.. అక్కడ కూడా బాలికపై దుర్మార్గులు అత్యాచారం చేశారు.
అయితే, రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న డీఎస్పీ అంకిత.. అనుమానాస్పదంగా ఆపి ఉన్న కారును గమనించారు. వెంటనే ఆ కారు వద్దకు వెళ్లి పరిశీలించగా.. కారులో ఐదుగురు కామాంధులు ఒంటిపై దుస్తులు లేకుండా ఉండటాన్ని గమనించారు. వారి మధ్యలో బాలిక ఏడుస్తూ కనిపించింది. వెంటనే అలర్ట్ అయిన డీఎస్పీ.. వెంటనే సమీపంలోని ధుర్వ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ ఝా కు ఫోన్ చేసి సిబ్బందిని పంపాల్సిందిగా కోరారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. నిందితులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.