IMD Alert: జూలై నెలలో అంతంత మాత్రమే.. దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం!

నైరుతి రుతుపవనాల రాక కోసం, స్థిరమైన వానచినుకుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న భారతీయ రైతన్నలకు, సామాన్య ప్రజానీకానికి మరికొన్ని రోజులు నిరాశ తప్పేలా లేదు. జూన్ నెలలో తీవ్రమైన వర్షపాత లోటును ఎదుర్కొన్న దేశానికి, జూలై నెలలోనూ పెద్దగా ఊరట లభించే సూచనలు కనిపించడం లేదు. ఈ జూలైలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ (IMD) విడుదల చేసిన అంచనాల్లో స్పష్టం చేసింది. 1901 తర్వాత దేశంలో ఐదవ అత్యంత పొడి జూన్ నెల నమోదైన నేపథ్యంలో, తాజా హెచ్చరికలు వ్యవసాయ రంగంపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.

IMD Alert: జూలై నెలలో అంతంత మాత్రమే.. దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం!
Agricuture

Updated on: Jul 01, 2026 | 7:19 AM

నైరుతి రుతుపవనాల రాక కోసం, స్థిరమైన వానచినుకుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న భారతీయ రైతన్నలకు, సామాన్య ప్రజానీకానికి మరికొన్ని రోజులు నిరాశ తప్పేలా లేదు. జూన్ నెలలో తీవ్రమైన వర్షపాత లోటును ఎదుర్కొన్న దేశానికి, జూలై నెలలోనూ పెద్దగా ఊరట లభించే సూచనలు కనిపించడం లేదు. ఈ జూలైలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ (IMD) విడుదల చేసిన అంచనాల్లో స్పష్టం చేసింది. 1901 తర్వాత దేశంలో ఐదవ అత్యంత పొడి జూన్ నెల నమోదైన నేపథ్యంలో, తాజా హెచ్చరికలు వ్యవసాయ రంగంపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.

94 శాతానికే పరిమితం.. జూన్‌లో 40% లోటు

దీర్ఘకాలిక సగటు 1971-2020 మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కించిన LPA ప్రకారం జూలై నెలలో కేవలం 94 శాతం వర్షమే కురవొచ్చని ఐఎండీ తెలిపింది. సాధారణంగా జూలై నెలలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 280.4 మిల్లీమీటర్లుగా ఉంటుంది. గడిచిన జూన్ నెలలో దేశవ్యాప్తంగా ఏకంగా 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మధ్య భారతంలో అత్యధికంగా 50.4 శాతం లోటు కనిపించింది. 1901లో వర్షపాత రికార్డులు ప్రారంభమైనప్పటి నుండి ఈ జూన్ నెల ఐదో అత్యల్ప వర్షపాతం నమోదైన నెలగా నిలిచింది. ఈ నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం కేవలం 99.5 మిల్లీమీటర్లుగానే రికార్డైంది.

ప్రమాదకరంగా మారుతున్న ‘ఎల్ నినో’ ప్రభావం!

ఈ ఏడాది వర్షాలు ముఖం చాటేయడానికి గల ప్రధాన కారణాలను ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వివరించారు. మధ్య – తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ఏర్పడే ‘ఎల్ నినో’ (El Nino) ప్రభావం రాబోయే నెలల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు మాడెన్-జూలియన్ ఆసిలేషన్ వాతావరణ వ్యవస్థ భారత్‌కు అనుకూలంగా లేకపోవడం, సముద్రంలో ఆశించిన స్థాయిలో అల్పపీడనాలు ఏర్పడకపోవడం, జూన్‌లో ఏర్పడిన తుపాను వ్యవస్థలు వాయవ్య దిశగా కదిలిపోవడం వల్ల రుతుపవనాల పురోగతి మందగించిందని ఆయన తెలిపారు.

వ్యవసాయం, నీటి లభ్యతపై తీవ్ర ప్రభావం

భారతదేశ వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా ఖరీఫ్ పంట కాలానికి నైరుతి రుతుపవనాలే ప్రధాన జీవనాధారం. దేశ జనాభాలో దాదాపు 45 శాతానికి పైగా జీవనోపాధిని కల్పించే ఈ రంగం పూర్తిగా ఈ వర్షాలపైనే ఆధారపడి ఉంది. జూలై వంటి కీలకమైన మాసంలో వర్షపాత లోటు ఏర్పడితే, అది పంటల సాగును దెబ్బతీయడమే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడికి, తీవ్రమైన వడదెబ్బ ప్రమాదాలకు దారితీస్తుందని వాతావరణ కార్యాలయం హెచ్చరించింది.

ఈ విపత్కర పరిస్థితులను తట్టుకోవడానికి నీటి సంరక్షణ పద్ధతులను ముమ్మరం చేయాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని ఐఎండీ ప్రభుత్వాలకు, రైతులకు సూచించింది. వ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లకుండా తక్షణమే ఆకస్మిక ప్రణాళికలను అమలు చేయాలని స్పష్టం చేసింది.

1500 కిలోమీటర్ల పొడవైన వర్ష మేఘం..!

దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాలకు మాత్రం తాత్కాలిక ఉపశమనం లభించనుంది. బంగాళాఖాతంలోని ఉత్తర భాగం నుంచి జమ్మూ కశ్మీర్ వరకూ దాదాపు 1500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న భారీ వర్ష మేఘాలు ఉపగ్రహ చిత్రాల్లో వ్యక్తమయ్యాయి. హిమాలయాలకు సమీపంలో ఏర్పడిన ఈ రుతుపవన ద్రోణి క్రమంగా దక్షిణం వైపు కదులుతోంది.

తెలంగాణకు ఉపశమనం!

ఇక తెలంగాణలో జూలై 1 నుంచి 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

జూలై 1 నుంచి 4 తేదీల మధ్య ఉత్తర భారతంలో రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉంది. వాయవ్యం, ఈశాన్యం, తూర్పు మధ్య, తూర్పు ద్వీపకల్పాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావొచ్చు. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రుద్రప్రయాగ్ వద్ద అలకనంద నది ఉప్పొంగి ప్రవహిస్తూ, ఒడ్డున ఉన్న ఘాట్లన్నింటినీ ముంచెత్తింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Follow Us