idli amma soon get new home: సామాజిక మాధ్యమాల్లో తన దృష్టికి వచ్చే వీడియోలు, ఫోటోలకు స్పందించడమే కాదు… కష్టాల్లో ఉన్నవారి పట్ల ఉదారత చూపే వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎనిమిది పదుల వయసులో రూపాయికే ఇడ్లీ అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తున్న ‘ఇడ్లీ బామ్మ’ కమలాత్తాళ్ అండగా నిలిచారు. త్వరలోనే ఆమె సొంత ఇంటి కల నెరవేరబోతోంది. అది కూడా పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా చలవతో. ఈ విషయాన్ని మహీంద్రా స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు.
The Mahindra @life_spaces team will soon start the construction as per Kamalathal’s requirement. Once again thanks to BharatGas Coimbatore for providing her a continued supply of LPG. (3/3) pic.twitter.com/NO6YtWr9b5
— anand mahindra (@anandmahindra) April 2, 2021
తమిళనాడులోని పేరూరు సమీపంలో గల వడివెలంపాలయం గ్రామానికి చెందిన కమలాత్తాళ్ గత 37ఏళ్లుగా రూపాయికే నాలుగు ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తున్నారు. రోజుకు వెయ్యి ఇడ్లీల వరకు అమ్ముతూ నిరుపేద జీవితాలకు తనవంతు సాయం చేస్తున్నారు. ఈ ఇడ్లీ బామ్మ గురించి 2019లో ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేయడంతో అప్పట్లో ఆ కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమెకు సాయం చేయడానికి ముందుకొచ్చిన మహీంద్రా.. కమలాత్తాళ్‌కు వంటగ్యాస్‌కు అయ్యే ఖర్చును భరిస్తున్నారు. అంతేకాదు ఆమె వ్యాపారంలో పెట్టుబడి పెడతానని కూడా ఆనంద్ మహేంద్రా హమీ కూడా ఇచ్చారు.
?? to the @MahindraRise team for understanding from Kamalathal how we can ‘invest’ in her business. She said her priority was a new home/workspace. Grateful to the Registration Office at Thondamuthur for helping us achieve our 1st milestone by speedily registering the land (2/3) pic.twitter.com/F6qKdHHD4w
— anand mahindra (@anandmahindra) April 2, 2021
తాజాగా మహీంద్రా మరోసారి ఆ బామ్మ వీడియో తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. కమలాత్తాళ్‌కు త్వరలోనే కొత్త ఇంటిని నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ‘‘ఒకరి స్ఫూర్తిమంతమైన జీవితంలో చిన్న భాగమయ్యే అరుదైన అవకాశం చాలా కొద్దిమందికి మాత్రమే లభిస్తుంది. నాకు ఆ అవకాశాన్ని కల్పించిన ఇడ్లీ అమ్మ కమలాత్తాళ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. త్వరలోనే ఆమెకు సొంత ఇల్లుతో పాటు పనిప్రదేశం కూడా రాబోతోంది’’ అని మహీంద్రా ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా కమలాత్తాళ్ వ్యాపారంలో ఎలా పెట్టుబడి పెట్టాలో చెప్పిన మహీంద్రారైజ్ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రస్తుతం బామ్మకు కావాల్సింది కొత్త ఇంటి స్థలం.. ఆమె పేరున భూమిని రిజిస్టర్ చేసి మాకు సాయపడిన తాండమూత్తూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ధన్యవాదాలు’ అని మహీంద్రా ట్విటర్‌లో పేర్కొన్నారు. త్వరలోనే మహీంద్రా కంపెనీ బృందం ఆమె కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కమలాత్తాళ్‌కు ఇప్పటికీ వంటగ్యాస్ అందిస్తోన్న భారత్‌గ్యాస్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.