ధోనిని విమర్శించేవారిని చూస్తుంటే జాలేస్తోంది ః కిర్మాణి

|

Oct 12, 2020 | 2:22 PM

నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు,నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అంటూ శ్రీశ్రీ అన్న పలుకులు ఇప్పుడు మహేంద్రసింగ్‌ థోనీకి అచ్చంగా సరిపోతాయి..

ధోనిని విమర్శించేవారిని చూస్తుంటే జాలేస్తోంది ః కిర్మాణి
Follow us on

నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు,నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అంటూ శ్రీశ్రీ అన్న పలుకులు ఇప్పుడు మహేంద్రసింగ్‌ థోనీకి అచ్చంగా సరిపోతాయి.. ధోనీ పీక్‌లో ఉన్నప్పుడు మురిసిపోయి చప్పట్లు కొట్టినవారే ఒకట్రెండు మ్యాచ్‌లో విఫలమయ్యే సరికి తిట్లదండకం ఎత్తుకుంటున్నారు.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న ధోనీ ఆట తీరుపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.. చాలా మంది ధోనీకి బాసటగా నిలుస్తున్నారు.. టీమిండియా మాజీ కెప్టెన్‌ సయ్యద్‌ కిర్మాణి కూడా ధోనికి మద్దతు పలికాడు.. ప్రతీ ఆటగాడికి కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమని, ఎల్లకాలం ఒకేలా ఉండదని కిర్మాణి అన్నారు. ధోనిని విమర్శిస్తున్నవారిని చూస్తుంటే జాలేస్తోందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్లలో ధోనీ ఒకడనే విషయాన్ని మనం మర్చిపోకూడదని వివరించారు. సుదీర్ఘ విరామం తర్వాత ధోని మళ్లీ క్రికెట్‌ ఆడుతున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు కిర్మాణి. అందుకే ఈ సీజన్‌లో కాసింత తడబాటు పడుతున్నాడే తప్ప ధోనిలో చురుకుదనం దగ్గలేదని అన్నారు.. నిజానికి యువకులతో పోలిస్తే ఈ వయసులో ఆటగాళ్లకు అంత చురుగ్గా కదలాడే శక్తి ఉండదు కానీ.. తన శక్తికి మించి ధోనీ ఆడుతున్నాడని కిర్మాణి కితాబిచ్చారు. క్రికెట్‌ నుంచి పూర్తిగా తప్పుకునే దశకు వచ్చిన తర్వాత భవిష్యత్తుపై అనేక ఆలోచనలు కలిగి ఉంటారనీ, ఇదంతా మనం అర్థం చేసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన చెన్నైకు కేవలం రెండే విజయాలు దక్కాయి.. పాయింట్ల పట్టికలో ఏడో ప్లేస్‌లో నిలిచింది.. మామూలుగా అయితే చెన్నై టాప్‌ త్రీ ప్లేసులలో ఉండాలి.. ఇలాగైతే ప్లే ఆఫ్స్‌కు చెన్నై వెళ్లడం కష్టమే.. అందుకే చెన్నై జట్టుపైనా, దానికి నేతృత్వం వహిస్తున్న ధోనిపైనా విమర్శలు వస్తున్నాయి. నిరుడు ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా ధోని ఆడాడు.. మళ్లీ ఐపీఎల్‌తోనే చేతికి గ్లౌజులు వేసుకున్నాడు..