తలుపులు మూసి ఎంతకు బయటకు రాని ప్రేమ జంట.. ఇంటి ఓనర్ తొంగి చూసి షాక్..!

ఢిల్లీలో తీవ్ర కలకలం రేపిన ఓ ఘోర ఉదంతం వెలుగుచూసింది. ప్రేమించిన యువతిని కాల్చి చంపి, ఆపై ప్రియుడు కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బురారీ పరిధిలో గల కమాల్‌పూర్ ప్రాంతంలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఒకే గదిలో ప్రేమికులిద్దరూ రక్తపు మడుగులో శవాలై పడి ఉండటం బురారీ పరిసర ప్రాంతాల్లో భయాందోళనలకు గురిచేసింది.

తలుపులు మూసి ఎంతకు బయటకు రాని ప్రేమ జంట.. ఇంటి ఓనర్ తొంగి చూసి షాక్..!
Horror In Delhi

Updated on: Jul 16, 2026 | 6:07 PM

ఢిల్లీలో తీవ్ర కలకలం రేపిన ఓ ఘోర ఉదంతం వెలుగుచూసింది. ప్రేమించిన యువతిని కాల్చి చంపి, ఆపై ప్రియుడు కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బురారీ పరిధిలో గల కమాల్‌పూర్ ప్రాంతంలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఒకే గదిలో ప్రేమికులిద్దరూ రక్తపు మడుగులో శవాలై పడి ఉండటం బురారీ పరిసర ప్రాంతాల్లో భయాందోళనలకు గురిచేసింది.

పోలీసులు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. నిఖిల్, శుభాంగి అనే ఇద్దరు యువతీయువకులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ గత నెల రోజులుగా కమాల్‌పూర్‌లోని ఒక అద్దె ఇల్లు తీసుకుని, అందులోనే సహజీవనం సాగిస్తున్నారు. అంతా సజావుగానే సాగుతుందనుకున్న తరుణంలో, బుధవారం (జూలై 16) వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవ కాస్తా ముదిరి పెద్దది కావడంతో ఆగ్రహానికి గురైన నిఖిల్ విచక్షణ కోల్పోయాడు. తన వద్ద ఉన్న తుపాకీతో తొలుత ప్రియురాలు శుభాంగిపై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపాడు. బుల్లెట్ బలంగా దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

శుభాంగి మరణించిన విషయాన్ని తెలుసుకున్న నిఖిల్ భయాందోళనకు గురయ్యాడు. తీవ్ర పశ్చాత్తాపంతో ఆ తర్వాత అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిఖిల్ కూడా తీవ్ర రక్తస్రావమై అక్కడే మరణించాడు. శుభాంగి, నిఖిల్ మృతదేహాలు నివాసముంటున్న గదిలో రక్తపు మడుగులో పడి ఉన్నాయి.

ఆ ఇల్లు మూసి ఉండి, లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే బురారీ పోలీసులు తమ క్రైమ్ బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా, రక్తపు మడుగులో పడి ఉన్న ప్రేమికుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిఖిల్ ఆత్మహత్యకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ దారుణానికి అసలు కారణాలు ఏమిటనే కోణంలో బురారీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. వారి మధ్య ఉన్న ఆర్థిక విభేదాలు కారణమా లేక వ్యక్తిగత గొడవలు దారి తీశాయా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. విచారణలో మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us