
మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో 65 ఏళ్ల ఓ వృద్ధుడికి కోర్టు మరణశిక్ష విధించిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. నస్రాపూర్ గ్రామానికి చెందిన భీమ్‌రావ్ అనే 65 ఏళ్ల వృద్ధుడు స్థానికంగా నివాసముంటున్న, తన మనవరాలి వయసున్న మూడేళ్ల చిన్నారిపై కన్నేశాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారితో మాటలు కలిపిన భీమ్‌రావు.. అప్పుడే పుట్టిన ఆవుదూడను చూపిస్తానని చెప్పి, నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఓ పశువుల కొట్టంలోకి తీసుకెళ్లాడు.
అక్కడే పాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం బయటకు రాకుండా చిన్నారిని ఓ బండరాయితో అతి కిరాతకంగా కొట్టి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. అయితే బయట ఆడుకుంటున్న చిన్నారి కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఆచూకీ కోసం గాలించగా.. పశువుల షెడ్డులో రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారి మృతదేహం కనిపించింది. అది చూసి ఒక్కసారిగా షాకైన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.
బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ (CCTV) కెమెరా దృశ్యాల ద్వారా నిందితుడిని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని కోర్టులో హాజరుపరచగా.. కేసుపై విచారణ జరిపిన పుణె ఫాస్ట్-ట్రాక్ కోర్టు భీమ్‌రావుకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.