
కర్ణాటక ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు మొట్టికాయలు వేసింది. బీజేపీ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు గత నెల ఆగస్టు 31న కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ పోకడలను విపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
కేసుల ఉపసంహరణకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పౌర హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హై కోర్టు రంగంలోకి దిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 61 మంది బీజేపీ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఆ నిర్ణయాన్ని అమలు చేయొద్దంటూ స్టే విధించింది. ఈ వ్యవహారంలో కోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే దీనిపై 2021, జనవరి 22వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను 2021, జనవరి 29వ తేదీకి వాయిదా వేసింది. ప్రజాస్వామ్య ముసుగులో మితిమీరిన పోకడలకు పుల్‌స్టాప్ పెట్టింది.