Kashmir: ఆ మూలకాలను వెలికితీస్తే భారత్ ఇక తిరుగులేని శక్తిగా మారుతుంది.. దేశ చరిత్రలో తొలిసారి వేలం
అవి భూమి మీద అత్యంత అరుదుగా మాత్రమే లభించే మూలకాలు.. ఖనిజాలు. దేశాల తలరాతలను పూర్తిగా మార్చగలిగే శక్తి వాటికి ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ప్రపంచ భవిష్యత్తును సైతం అవి శాసిస్తాయి. ఇంతకాలం వాటిని అవసరాల మేరకు దిగుమతి మాత్రమే చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు దేశీయ అవసరాలకు సరిపడా సొంతంగా తయారుచేసుకునే అవకాశం వచ్చింది. అవసరాలకు మించి ఉత్పత్తి జరిగితే ఎగుమతుల ద్వారా ఆదాయం కూడా గడించవచ్చు. ఇంతకీ ఆ మూలకాలు ఏంటి? అవి ఎక్కడ దొరుకుతాయి? వాటితో ఉపయోగాలు ఏంటి?

అవి భూమి మీద అత్యంత అరుదుగా మాత్రమే లభించే మూలకాలు.. ఖనిజాలు. దేశాల తలరాతలను పూర్తిగా మార్చగలిగే శక్తి వాటికి ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ప్రపంచ భవిష్యత్తును సైతం అవి శాసిస్తాయి. ఇంతకాలం వాటిని అవసరాల మేరకు దిగుమతి మాత్రమే చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు దేశీయ అవసరాలకు సరిపడా సొంతంగా తయారుచేసుకునే అవకాశం వచ్చింది. అవసరాలకు మించి ఉత్పత్తి జరిగితే ఎగుమతుల ద్వారా ఆదాయం కూడా గడించవచ్చు. ఇంతకీ ఆ మూలకాలు ఏంటి? అవి ఎక్కడ దొరుకుతాయి? వాటితో ఉపయోగాలు ఏంటి?
ఇ-వరల్డ్ (e-World) కి ఆ మూలకం అత్యంత కీలకం
ప్రపంచవ్యాప్తంగా నేటి సమాజం ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు అన్నింట్లోనూ ఉపయోగించే బ్యాటరీలు, ఇతర పరికరాల తయారీలో కొన్ని మూలకాలు, ఖనిజాలు అవసరం చాలా ఉంటుంది. బ్యాటరీలో తయారీలో ‘లిథియం’ అనే మూలకం అత్యంత కీలకమైనది. ఇది భూమ్మీద ఎక్కడంటే అక్కడ లభించే మూలకం కాదు. పైగా దీన్ని వెలికితీయడం కూడా అంత సులభం కాదు. దీంతో పాటు టైటానియం, కోబాల్ట్, గ్రాఫైట్ వంటి ఖనిజాలు, మూలకాలు కూడా చాలా అరుదుగా మాత్రమే భూమి మీద లభిస్తాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు, సోలార్ ప్యానెళ్లు, సెమీకండక్టర్లు, విండ్ టర్బైన్లతో తయారీతోపాటు ఆధునిక శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఈ ఖనిజాలు, మూలకాలను వినియోగిస్తున్నాం. ఇంతకాలం కేవలం దిగుమతులపై మాత్రమే ఆధారపడ్డ భారత్, దేశీయంగా ఆ అరుదైన ఖనిజాల లభ్యతపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌లోని జమ్ము-కాశ్మీర్‌లోని రియాసీ జిల్లాల్లో ‘లిథియం’ నిక్షేపాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఏకంగా 5.9 మిలియన్ టన్నుల ‘లిథియం’ నిక్షేపాలు ఉన్నాయని తేల్చింది.
వాహన కాలుష్యానికి చెక్ పెట్టాలంటే ఎలక్ట్రిక్ వాహనాలను విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావాలి. కానీ వీటి తయారీలో విద్యుత్తును నిల్వచేసే బ్యాటరీలు కీలకం. బ్యాటరీల తయారీలో ఈ ‘లిథియం’ అత్యంత కీలకం. అంటే కాలుష్యరహిత, తక్కువ ఖర్చుతో కూడిన భవిష్యత్తు ప్రపంచంలోకి భారతదేశాన్ని అడుగుపెట్టేలా చేసే అత్యంత కీలకమైన మూలకమే ఈ ‘లిథియం’. భారత్‌లో గుర్తించిన నిక్షేపాలను వెలికి తీసి వినియోగిస్తే బ్యాటరీల తయారీలో మనదేశం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితే తలెత్తదు. పైపెచ్చు వీలుంటే మిగతా ప్రపంచ దేశాల అవసరాలను కూడా తీర్చవచ్చు.
నేటి నుంచి బిడ్డింగ్
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (REE)గా పిలిచే అరుదైన మూలకాలుకు చెందిన 20 బ్లాకులను వేలం వేసేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 29న బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించాలని కేంద్ర గనులశాఖ ముహూర్తం ఖరారు చేసుకుంది. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఈ 20 బ్లాకులకు వేలం ప్రక్రియను రెండు అంచెలుగా సాగుతుందని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు నెల రోజుల సమయం పడుతుందని తెలిపారు.
2023 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అరుదైన మూలకాలు, ఖనిజాల వెలికితీత కోసం చట్ట సవరణ చేసింది. గతంలో ఖనిజ నిక్షేపాల వెలికితీత ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టేవి. కానీ ఇవి అరుదైన మూలకాలు కావడంతో మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 1957కు కేంద్రం సవరణలు చేసింది. తద్వారా ఈ ఖనిజాలు, మూలకాల వెలికితీతకు వేలం ప్రక్రియ నిర్వహించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దక్కింది. అలాగే ఆ మూలకాల వెలికితీత కోసం కమర్షియల్ మైనింగ్‌కు సైతం ఆస్కారం కల్గించేలా సవరణలు చేసింది. వాటిలో లిథియం, బెరీలియం, నియోబియం, టాటాలం, టైటానియం, జిర్కోనియం వంటి అరుదైన మూలకాలతో పాటు భూమి లోపలి పొరల నుంచి వెలికితీయాల్సిన బంగారం, వెండి, రాగి ఖనిజాలను వెలికితీసే విషయంలో కమర్షియల్ మైనింగ్‌కి పచ్చజెండా ఊపింది. గతంలో వీటిని గుర్తించేందుకు జరిపే అన్వేషణ నుంచి వెలికితీసే వరకు అన్ని పనులు నేరుగా ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే నిర్వహించేవి. ప్రైవేట్ సంస్థలను ఈ వెలికితీత ప్రక్రియలో ప్రోత్సహించేందుకు ఒక్కో ఖనిజానికి ఒక్కోరకమైన రాయల్టీ రేటును కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ క్రమంలో ప్లాటినం గ్రూప్ ఖనిజాలకు 4 శాతం, మాలిబ్డినం కు 7.5 శాతం, గ్లౌకోనైట్, పొటాష్ కు 2.5 శాతం రాయల్టీగా 2022లోనే ఖరారు చేయగా.. లిథియం, నియోబియం వెలికితీతలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ రేటు 3 శాతంగా నిర్ణయించింది. అలాగే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కి 1 శాతంగా ఖరారు చేసింది.
భారత ఆర్థిక వృద్ధిలో 30 కీలక మూలకాలు, ఖనిజాల జాబితాను ప్రభుత్వం రూపొందించింది. ఈ ఖనిజాలు భారత శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు రక్షణ, పునరుత్పాదక ఇంధన వనరులు, వ్యవసాయం, ఫార్మా రంగం, హై-టెక్ ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్స్, రవాణా రంగంతో పాటు గిగా ఫ్యాక్టరీల రూపకల్పనలో కీలకమైనవిగా గుర్తించింది. వాటిని గుర్తించి, వెలికితీసే ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలంటే కమర్షియల్ మైనింగ్‌కి అవకాశం కల్పిస్తేనే సాధ్యపడుతుందని భావించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..