స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ఒక్కసారిగా మన చుట్టూ ప్రపంచమే మనచేతిలోకి వచ్చినంత పనైంది. దీని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. గతంలో ఎవరైనా తెలియని ప్రాంతాలకు వెళితే ముందే రూట్‌మ్యాప్ తీసుకెళ్లడమో.. లేదంటే ఎవరి సహాయమైనా తీసుకుని గమ్యానికి చేరుకునేవారు. కానీ నేటి సాంకేతిక యుగంలో టెక్నాలజీ పుణ్యమా అని ఎలాంటి ప్రదేశానికైనా ఎవరి సాయం లేకుండానే వెళ్లివస్తున్నాం. దీంతో గూగుల్ మ్యాప్స్ తెగ ఫేమస్ అయిపోయాయి. వీటి వాడటం ప్రతి ఒక్కరికీ అలవాటుగా మారింది. అయితే కొన్ని సందర్భాల్లో దీనిని గుడ్డిగా నమ్మడం వల్ల లేనిపోని చిక్కులు తలకు చుట్టుకోవడం వంటి ఘటనలు ఇటీవల వార్తల్లో చూస్తూనే ఉన్నాం. గూగుల్ మ్యాప్స్‌లో అడ్రస్ సరిగ్గా చూపిస్తున్నా.. పలువురు ప్రమాదాల బారినపడుతున్నారు. అలాంటి సంఘటనే తాజాగా కేరళలో మరొకటి చోటు చేసుకుంది.
కేరళ కాసర్‌గోఢ్ జిల్లాకు చెందిన అబ్దుల్ రషీద్ అనే యువకుడితో పాటు తష్రీఫ్ అనే మరో యువకుడు ఆదివారం తెల్లవారు జామున 6 గంటలకు పొరుగన ఉన్న కర్ణాటకలోని ఆసుపత్రికి బయల్దేరారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లసాగారు. ఈ క్రమంలో వీరి కారు గత గురువారం తెల్లవారుజామున కాసర్‌గోడ్‌లోని పల్లంచి ఫారెస్ట్ రోడ్డు పక్కనున్న నదిలో పడిపోయింది. నదిలో నీటి ప్రవాహం ఆధృతంగా ఉండటంతో వీరికారు నీటిలో కొట్టుకుపోయి ఓ చెట్టుకు చిక్కుకుపోయింది. దీంతో వెంటనే వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. వారు అక్కడికి చేరుకుని యువకులను కాపాడటంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆస్పత్రికి వెళ్లే క్రమంలో గూగుల్ మ్యాప్స్ తమను ఇరుకైన దారిగుండా తీసుకెళ్లిందని, వాహనం హెడ్‌లైట్ వెలుగులో ముందు కొంచెం నీరు కనిపించిందని, అయితే అది నదిపై ఉన్న వంతెనగా తాము ఊహించలేకపోయామని ఆ ఇద్దరు యువకులు చెప్పుకొచ్చారు. రెండు వైపులా నీరు ఉండటం, చుట్టూ అంతా చీకటిగా ఉండటంతో, వంతెనపై సైడ్‌వాల్ సైతం కనిపించలేదని చెప్పారు. ఆ తర్వాత కారు అకస్మాత్తుగా నీటిలో కొట్టుకుపోయిందని.. నది ఒడ్డున చెట్టుకు చిక్కుకుకుపోవడంతో, విండో కిటికీలు కిందికి దించి చెట్టుకొమ్మలు పట్టుకుని తప్పించుకున్నామని తెలిపారు.
ప్రమాదం గురించి తమ బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించగా.. వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారని, అగ్నిమాక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని తాళ్లతో తమని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని, ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదని, ఇది నిజంగా పునర్జన్మ అని రషీద్ తెలిపాడు. కాగా నాలుగేళ్ల క్రితం ప్రమాద స్థలం నుంచి 500 మీటర్ల దూరంలో కొత్తగా ఎత్తైన వంతెన నిర్మించారు. అయితే Google Maps మాత్రం ఇప్పటికీ పాత వంతెన మార్గానే చూపిస్తుండటంతో ఈ ప్రమాదం జరిగింది. కేరళలో ఇలాంటి ఘటన జరగడం ఇదేం మొదటిసారి కాదు. గత నెలలో హైదరాబాద్ నుంచి వచ్చిన టూరిస్ట్ బృందం ప్రయాణిస్తున్న కారు.. గూగుల్ మ్యాప్స్ ఉపయోగించడం వల్ల కొట్టాయంలోని కురుప్పంతర సమీపంలో ఉబ్బిన ప్రవాహంలోకి దూసుకుపోయింది. సమీపంలోని పోలీసు పెట్రోలింగ్ యూనిట్ ఉండటంతో వారంత క్షేమంగా తప్పించుకోగలిగారు. కానీ వారి వాహనం నీళ్లలో కొట్టుకుపోయింది.