
కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి గుడిలో బంగారం మాయం సంచలనం రేపుతోంది. గుడిని చూసుకునే ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డుపై బంగారం దొంగతనం, ఆస్తుల దుర్వినియోగం లాంటి సీరియస్ ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో లక్షల విలువైన గుడి ఆస్తులు మాయం కావడం కలకలం రేపింది.
గుడిలోని ద్వారపాలకులు, పీఠాలపై ఉన్న బంగారు పూతను టీడీబీ అధికారులు రహస్యంగా తీసేశారని శబరిమల ప్రత్యేక కమిషనర్ కేరళ హైకోర్టుకు నివేదించడంతో ఈ మొత్తం వ్యవహారం మొదలైంది. సెప్టెంబర్ 7న మరమ్మత్తుల కోసం చెన్నైకి పంపినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. అయితే 2019లో ఇలాగే మరమ్మత్తు చేసినప్పుడు కూడా బంగారం బరువులో తేడాలు వచ్చాయి. దీంతో కేరళ హైకోర్టు ఈసారి స్వయంగా విచారణ మొదలుపెట్టింది. విచారణలో తెలిసిన విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 1.5 కిలోల బంగారం వాడిన ప్లేట్లను TDB రికార్డుల్లో ‘రాగి పలకలు’ అని తప్పుగా రాశారు. కానీ 1999లో ఆ క్లాడింగ్ కోసం 1.5 కిలోల బంగారం ఉపయోగించారనే వాస్తవాన్ని TDB దాచిపెట్టింది. శబరిమల సన్నిధానంలోని ముఖ్య భాగాలకు 1998లో విజయ్ మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ మొత్తం 30.291 కిలోల బంగారాన్ని స్పాన్సర్ చేసింది. ఇందులో ద్వారపాలకుల క్లాడింగ్‌కు 1.564 కిలోల బంగారం వాడారు.
ఈ నేపథ్యంలో ద్వారపాలకుల మరమ్మత్తులు సన్నిధానంలోనే జరగాలని TDB నిబంధనలు చెప్తున్నప్పటికీ, వాటిని మరమ్మత్తుల కోసం ఉన్నికృష్ణన్‌కు అప్పగించి చెన్నైకి పంపడం వివాదాస్పదంగా మారింది. 2019లో వస్తువులను అందుకున్న ఉన్నికృష్ణన్, వాటిని మరమ్మత్తు సంస్థకు పంపడానికి ముందే ఒక నెల రోజులు తనవద్దే ఉంచుకుని, చెన్నై, బెంగళూరులో నిధుల సేకరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో నటుడు జయరామ్ కూడా పాల్గొన్నారు. 2019లో మరమ్మత్తు తర్వాత తిరిగి వచ్చిన వస్తువుల బరువులో ఏకంగా 4.5 కిలోల బరువు తగ్గింది. కానీ బోర్డు దీన్ని పట్టించుకోలేదు. 2023లోనూ బంగారం పూత మరమ్మత్తు బాధ్యతను ఉన్నికృష్ణన్ పొట్టి అనే వ్యాపారవేత్తకు అప్పగించారు.
ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవని గుర్తించిన హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి పోలీసులతో సిట్ ఏర్పాటు చేసింది. అంతేకాదు గుడిలోని ఆస్తుల విలువను లెక్కించడానికి ఒక మాజీ న్యాయమూర్తిని కూడా నియమించింది. ఈ స్కామ్‌పై ప్రతిపక్షాలు కేరళ అసెంబ్లీలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. వెంటనే దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. TDB నిర్లక్ష్యం, తప్పుడు రికార్డుల నమోదు, విలువైన ఆస్తుల విషయంలో గోప్యత పాటించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దర్యాప్తులో ఇంకా ఎన్నో కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి