వచ్చే నెల 1 నుంచి రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. 18 ఏళ్ళు పైబడినవారికి కూడా ఫ్రీగా టీకామందు ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వెల్లడిస్తూ ……దేశంలో కరోనా నిర్మూలనకు తమ సర్కార్ చేయాల్సిన కృషి అంతా చేస్తుందన్నారు. ఇటీవల ఆదిత్యనాథ్ కూడా కోవిడ్ పాజిటివ్ కి గురయ్యారు. కరోనా వైరస్ ఓడిపోతుంది..ఇండియా గెలుస్తుంది అని ఆయన ట్వీట్ చేశారు. యూపీలో వీకెండ్ లాక్ డౌన్ ను అమలు చేయాలనీ అధికారులు నిర్ణయించారు. శుక్రవారం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటలవరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. అయితే నిత్యావసరాలను మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయించారు. తాము తప్పనిసరై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వ్యాక్సినేషన్ సెంటర్లను పెంచుతామని, రాష్ట్రంలో ఆయా వయస్సులవారికి సంబంధించి డేటా బేస్ వ్యవస్థను తాము ఏర్పాటు చేయాల్సి ఉందని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో సుమారు 20 కోట్ల జనాభా ఉన్నారు.
ఇక అస్సాం ప్రభుత్వం కూడా తాము వచ్చేనెల 1 నుంచి ఉచితంగా అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించింది. 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వయస్సువారి వరకు ఫ్రీగా టీకామందు ఇస్తామని, ప్రజలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హేమంత్ బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటాయని భావిస్తున్నామన్నారు. అస్సాం ఆరోగ్య నిధి కింద గత ఏడాది సేకరించిన నిధులను వ్యాక్సిన్ల కొనుగోలుకు వినియోగిస్తామని ఆయన పేర్కొన్నారు. కోటి డోసుల కొవాగ్జిన్ టీకామందు కోసం తాము భారత్ బయో టెక్ సంస్థను సంప్రదించామని ఆయన తెలిపారు .