
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న 91 ఏళ్ల పాటిల్ శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని లాతూర్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన శివరాజ్ పాటిల్, లాతూర్ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. ఆయన 1980 నుండి 2004 వరకు సుదీర్ఘంగా ఏడుసార్లు వరుసగా లాతూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1972 1978లో లాతూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కూడా ఆయన విజయం సాధించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో, ఆయన అనేక ప్రతిష్టాత్మక పదవులను నిర్వహించారు.
శివరాజ్ పాటిల్ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన పదవులలో ఒకటైన కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. అయితే 2008లో జరిగిన ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో ఆయన హోంమంత్రిగా ఉన్నారు. భద్రతా లోపాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తర్వాత ముంబై దాడులను నిరోధించడంలో వైఫల్యాన్ని అంగీకరించి, నైతిక బాధ్యత వహిస్తూ పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు ఆయన లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. లాతూర్ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఏకధాటిగా ఏడుసార్లు గెలిచిన ఆయన ప్రస్థానం, 2004లో బీజేపీ అభ్యర్థి రూపతై పాటిల్ నీలంగేకర్ చేతిలో ఓటమితో ముగిసింది. దేశ రాజకీయాల్లో దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించిన శివరాజ్ పాటిల్ మరణం పట్ల మహారాష్ట్ర, కాంగ్రెస్ పార్టీ తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.
శివరాజ్ పాటిల్ 1935 అక్టోబర్ 12న లాతూర్ జిల్లాలోని చకూర్‌లో జన్మించారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత ముంబై విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1963లో శివరాజ్ పాటిల్ చకుర్కర్, విజయ పాటిల్‌ను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. శివరాజ్ పాటిల్ కోడలు డాక్టర్ అర్చన పాటిల్ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. శివరాజ్ పాటిల్ తన రాజకీయ జీవితాన్ని లాతూర్ మునిసిపల్ కార్పొరేషన్ నుండి ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..