AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ఒక్క అంగుళం భూమి కూడా కోల్పోలేదు”.. రాహుల్ గాంధీ విమర్శలకు జనరల్ నరవాణే స్ట్రాంగ్ కౌంటర్!

భారత మాజీ సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భారత్-చైనా సరిహద్దు వివాదం, తన పుస్తకంపై వస్తున్న ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ, సరిహద్దుల భద్రత, రాజకీయ విమర్శలపై ఆయన తన గళాన్ని విప్పారు. 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకం విషయం గురించి ప్రస్తావించారు.

ఒక్క అంగుళం భూమి కూడా కోల్పోలేదు..  రాహుల్ గాంధీ విమర్శలకు జనరల్ నరవాణే స్ట్రాంగ్ కౌంటర్!
General Naravane, Rahul Gandhi
Balaraju Goud
|

Updated on: Apr 24, 2026 | 8:43 AM

Share

భారత మాజీ సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భారత్-చైనా సరిహద్దు వివాదం, తన పుస్తకంపై వస్తున్న ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ, సరిహద్దుల భద్రత, రాజకీయ విమర్శలపై ఆయన తన గళాన్ని విప్పారు.

చైనాకు భారతదేశం భూభాగాన్ని కోల్పోతోందన్న ప్రతిపక్షాల వాదనను జనరల్ నరవాణే తీవ్రంగా ఖండించారు. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి భారత్ ఒక్క అంగుళం భూమిని కూడా కోల్పోలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తూ, “దేశ ప్రధానమంత్రిని, రక్షణ మంత్రిని, విదేశాంగ మంత్రిని, సైన్యాధిపతిని నమ్మకూడదనుకుంటే, ప్రపంచంలో ఏ వాదన కూడా మీ అభిప్రాయాన్ని మార్చలేదు” అని ఆయన పేర్కొన్నారు.

చైనాతో ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో ప్రభుత్వం తనను విడిచిపెట్టిందన్న ఆరోపణలను ఖండిస్తూ, భారత మాజీ సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే తనకు ప్రభుత్వ పూర్తి మద్దతు ఉందని పేర్కొన్నారు. పరిస్థితి డిమాండ్ చేస్తే చైనా సైనికులపై కాల్పులు జరిపే పూర్తి హక్కు తనకు ఉందని ఆయన స్పష్టంగా తెలిపారు. పార్లమెంటులో ఈ విషయంపై జరిగిన వాడివేడి చర్చ జరిగిన కొన్ని నెలల తర్వాత ఈ ప్రకటనలు వెలువడ్డాయి. ఆ చర్చలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, జనరల్ నరవాణే అప్రచురిత పుస్తకం ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’లో వెల్లడైన విషయాన్ని ప్రస్తావించారు. పాంగోంగ్ సరస్సు దక్షిణ ఒడ్డున ఉన్న రేచిన్ లా కనుమ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణ సమయంలో జనరల్ ప్రభుత్వం నుండి ఆదేశాలు కోరినప్పుడు, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి ద్వారా ఆయనకు ఏది సముచితమని అనిపిస్తే అది చేయమని చెప్పారని ఆ పుస్తకం వెల్లడించిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే క్లారిటీ ఇచ్చారు.

దేశ సరిహద్దు, హద్దుల (Boundary) మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆయన వివరించారు. చైనా తన 14 పొరుగు దేశాలలో 12 దేశాలతో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుందని, భారత్ – భూటాన్‌లతో మాత్రమే సమస్యలు మిగిలి ఉన్నాయని గుర్తుచేశారు. చర్చల ద్వారా మాత్రమే ‘విన్-విన్ సిట్యుయేషన్’ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చైనాతో ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో ప్రభుత్వం తనను ఒంటరిని చేసిందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తనకు ప్రభుత్వ పూర్తి మద్దతు ఉందని, క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తనకు ఉందని వెల్లడించారు. ఇందుకు గాల్వాన్ ఘటన ఒక ఉదంతం అన్నారు. గాల్వాన్ లోయలో 20 మంది వీర సైనికులను కోల్పోయినప్పుడు, సైన్యం చైనాను శత్రువుగానే పరిగణించిందని ఆయన చెప్పారు. పరిస్థితి డిమాండ్ చేస్తే చైనా సైనికులపై కాల్పులు జరిపే పూర్తి హక్కు తనకు ఉందని ఆయన స్పష్టం చేశారు.

జనరల్ నరవాణే రాసిన కొత్త పుస్తకాన్ని ప్రభుత్వం అడ్డుకుంటోందన్న విమర్శలపై ఆయన స్పష్టతనిచ్చారు. ఈ పుస్తకం పూర్తిగా తన వ్యక్తిగత అనుభవాలపై ఆధారపడిందని, ఇందులో ఎలాంటి రహస్యంగా గానీ, ప్రభుత్వ పత్రాలను ఉపయోగించలేదని నరవాణే తెలిపారు. “పుస్తక ప్రచురణకు సంబంధించి ప్రచురణకర్త, ప్రభుత్వం మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఇది పాఠకుల ముందుకు వస్తుంది.” అని ఆయన తెలిపారు.

మొత్తానికి, దేశ భద్రత విషయంలో సైన్యం – ప్రభుత్వం సమన్వయంతో ఉన్నాయని, రాజకీయ విమర్శలు వాస్తవ దూరమని జనరల్ నరవాణే తన ఇంటర్వ్యూ ద్వారా స్పష్టం చేశారు. సరిహద్దు వివాద పరిష్కారానికి దౌత్యపరమైన, రాజకీయ దృక్పథం అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us