20 చోరీ కేసుల్లో నిందితుడు.. అర్ధరాత్రి పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్! ఆ తర్వాత సీన్‌ ఇదే

హర్యానాలోని ఫరీదాబాద్‌లో పోలీసులకు, దాదాపు 20 దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్న విమల్‌కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సెక్టార్‌ 58లోని ప్లేటింగ్‌ జోన్‌ సమీపంలో జరిగిన ఈ ఘటనలో పోలీసుల ప్రతిఘటన కాల్పులకు అతడి కుడికాలికి బుల్లెట్‌ తగిలింది. నిందితుడి వద్ద నుంచి పిస్టల్‌, కాట్రిడ్జ్‌లు, దొంగిలించిన మోటార్‌సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు..

20 చోరీ కేసుల్లో నిందితుడు.. అర్ధరాత్రి పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్! ఆ తర్వాత సీన్‌ ఇదే
Faridabad Encounter

Updated on: Nov 12, 2026 | 10:41 AM

ఫరీదాబాద్, నవంబర్ 12: హర్యానాలోని ఫరీదాబాద్‌లో పోలీసులకు, ఓ నేరస్థుడికి మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 20 దొంగతనం కేసుల్లో పోలీసులకు కావాల్సిన విమల్ అనే నిందితుడు ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డాడు. పోలీసుల ప్రతిఘటన కాల్పుల్లో అతడి కుడికాలికి బుల్లెట్ తగిలింది. నవంబరు 11, 12 తేదీల మధ్య రాత్రి సెక్టార్‌ 58లోని ప్లేటింగ్‌ జోన్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సుభాష్‌ కాలనీకి చెందిన విమల్‌ దొంగిలించిన మోటార్‌సైకిల్‌పై ప్లేటింగ్‌ జోన్‌ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఏదైనా నేరానికి పాల్పడే ఉద్దేశంతో వచ్చినట్లు పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలో ఉంచా గావ్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ బృందం అతడి కదలికలను గుర్తించి అడ్డుకునేందుకు ప్రయత్నించింది. పోలీసులు సమీపానికి రాగానే విమల్‌ వారిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో విమల్‌ కుడికాలికి బుల్లెట్‌ తగిలి గాయపడ్డాడు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఘటనా స్థలంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి ఒక పిస్టల్‌, మూడు కాట్రిడ్జ్‌లు, రెండు ఖాళీ కాట్రిడ్జ్‌ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే విమల్‌ ప్రయాణించిన దొంగిలించిన మోటార్‌సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. విమల్‌పై వివిధ పోలీస్‌ స్టేషన్లలో దాదాపు 20 దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా సెక్టార్‌ 58 పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన నాలుగు నుంచి ఐదు దొంగతనం కేసుల్లో అతడు ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులకు సంబంధించి పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఎదురుకాల్పుల్లో గాయపడిన విమల్‌ను పోలీసులు వెంటనే ఫరీదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైద్య చికిత్స అనంతరం నిందితుడిని మరింత విచారించే అవకాశం ఉంది. అతడికి సంబంధించిన ఇతర నేరాలు, దొంగతనం కేసుల వివరాలపై ఫరీదాబాద్‌ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us