థాయిలాండ్, సెప్టెంబర్ 25: అడ్డగోలు సంపాదనకు అలవాటుపడ్డ ఓ మానవమృగం డాక్టర్ ముసుగు వేసుకుని 20 యేళ్లుగా క్లిష్టమైన సర్జరీలు చేయసాగాడు. అతగాడు చదివింది కేవలం 9వ తరగతి వరకు మాత్రమే. డాక్టర్‌నని చెప్పుకుంటూ రోగులకు సర్జరీలు చేస్తున్న ఈ నకిలీ డాక్టర్ బండారం బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేసి, జైల్లో వేశారు. ఈ షాకింగ్ ఘటన థాయిలాండ్‌లో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సెంట్రల్ థాయ్‌లాండ్‌లోని సముత్ సఖోన్ నగరానికి చెందిన కిట్టికోర్న్ సాంగ్రీ (36).. అనే వ్యక్తి సొంతంగా క్లినిక్ ఏర్పాటు చేసుకుని, గత 20 యేళ్లుగా ఎంతో సక్సెస్‌ఫుల్‌గా క్లినిక్ రన్ చేస్తున్నాడు. పైగా తన పనితనాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునేవాడు. మొదట్లో సాంగ్రీ మాయ మాటలు నమ్మి, అతడి క్లినిక్‌లో రోగులు పెద్ద సంఖ్యలో క్యూలు కట్టడం ప్రారంభించాయి. అయితే ఇటీవల అతని వద్ద సర్జరీ చేయించుకున్న ఓ రోగి తీవ్రమైన సిలికాన్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యాడు. డాక్టర్ తీరుపై ఆనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ నకిలీ సర్జన్ బండారాన్ని బయటపెట్టారు.
అతన్ని అరెస్టు చేసి విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో తాను అసలు మెడిసిన్ చదవలేదని.. తనకు మెడికల్ లైసెన్స్ లేదని అంగీకరించాడు. ఎలాంటి మెడికల్ బ్యాక్‌గ్రౌండ్, లైసెన్స్ లేకుండా ప్రతి నెలా కనీసం ఇద్దరు, ముగ్గురు వ్యక్తులకు ఆపరేషన్లు చేస్తున్నానని పోలీసులకు తెలిపాడు. కేవలం 9వ తరగతి మాత్రమే చదివి డాక్టర్ అయ్యానని తెలిపాడు. తాను 14 యేళ్ల వయసులోనే ఇంప్లాంట్లు ఎలా చేయాలో నేర్చుకున్నానని, అప్పటి నుంచి ఎంతో మందికి ఆపరేషన్లు చేశానని తెలిపాడు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.13 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు నేరం అంగీకరించాడు. ఇతగాడి అడ్డగోలు బిజినెస్ బట్టబయలు కావడంతో గతంలో అతడి వద్ద ఆపరేషన్లు చేయించుకున్న వారంతా భయంతో డాక్టర్ల వద్దకు పరుగులు తీశారు.