
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. గైర్హాజరు, వలస వెళ్లినవారు, మరణించినవారు, డూప్లికేట్ కేటగిరీల్లో గుర్తించి ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చని వారికి మరో అవకాశం కల్పించింది. ఎన్యుమరేషన్ ఫారాలు అందకపోవడంతో ముసాయిదా జాబితాలో చోటు దక్కని అర్హులైన ఓటర్లు తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లు చేర్చుకునేందుకు మళ్లీ ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఈ ఆదేశాలు ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, నాగాలాండ్‌లకు వర్తించనున్నాయి. సంబంధిత పోలింగ్ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల్లో ASDD ఓటర్ల జాబితాలను మరోసారి ప్రదర్శించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోవడానికి గల కారణాలను కూడా వెల్లడించాలని సూచించింది. రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల (CEO) వెబ్‌సైట్లలోనూ ఈ జాబితాలను PDF రూపంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఓటు నమోదు కాని సంబంధిత ఓటర్లకు పాక్షికంగా నింపిన ఎన్యుమరేషన్ ఫారాలను ECINETలో మళ్లీ జనరేట్ చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
BLOలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను సంప్రదించి ఫారాలు అందజేయాలని, వాట్సాప్, ఈ-మెయిల్, SMS ద్వారా కూడా ఫారాలు పంపించే అవకాశం కల్పించాలని సూచించింది.పాత EPIC నంబర్‌ను నమోదు చేసి ECI వెబ్‌సైట్ లేదా ECINET యాప్ ద్వారా ఫారాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, నింపుకోవచ్చు. గతంలో అదే నివాసంలో ఉన్నవారు ఎన్యుమరేషన్ ఫారంతో పాటు ఎందుకు ముందుగా సమర్పించలేకపోయారో వివరిస్తూ అనుబంధం-B ప్రకటన సమర్పించాలి. రాష్ట్రంలోనే మరో ప్రాంతానికి నివాసం మార్చుకున్నవారు ఫారం-8 సమర్పించాల్సిన అవసరం లేదు. కొత్త చిరునామా, అసెంబ్లీ నియోజకవర్గ వివరాలతో ఎన్యుమరేషన్ ఫారం, అనుబంధం-C ప్రకటన, చిరునామా ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. కొత్త ప్రాంతంలోని BLOను కూడా సంప్రదించి సహాయం పొందవచ్చు. ECINET యాప్‌లో ‘mBook a Call with BLO సదుపాయం అందుబాటులో ఉంది.
ఇల్లు లేని వారి కోసం
ఇల్లు లేని వారికి చిరునామా రుజువు పత్రాలు లేకపోతే BLO క్షేత్రస్థాయి ధ్రువీకరణ నివేదిక సరిపోతుంది. ఫారాలను పరిశీలించి అర్హత, సాధారణ నివాసం తదితర వివరాలను ధ్రువీకరించిన తర్వాత EROలు నిర్ణయం తీసుకుంటారు. ఆమోదించిన దరఖాస్తులను తుది ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రత్యేకంగా ఉంచాలని, గతంలో ఉన్న EPIC నంబర్‌నే తిరిగి కేటాయించాలని ఆదేశం ఇచ్చింది.SIR సమయంలో ఇప్పటికే కొత్త నమోదు కోసం ఫారం-6 సమర్పించిన వారు మళ్లీ ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాల్సిన అవసరం లేదు.
ఈ ప్రక్రియపై విస్తృత ప్రచారం నిర్వహించి అర్హులైన ఏ ఒక్క ఓటరుకూ అవకాశం కోల్పోకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం సూచించింది.ఈ మేరకు అన్ని సంబంధిత రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం కార్యదర్శి పవన్ దివాన్ లేఖ రాశారు. ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినంత మాత్రాన తిరిగి నమోదు నిరాకరించినట్లు కాదని, నిర్దేశించిన ప్రక్రియలో దరఖాస్తు చేసుకుని అర్హతను నిరూపించుకుంటే తుది జాబితాలో పేరు చేర్చుకునే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.