
గత కొన్ని రోజులుగా ఇండియన్ సోషల్ మీడియాను ఒక విచిత్రమైన వీడియో ఊపేస్తోంది. ఏదో స్పై థ్రిల్లర్ సినిమాలో చూపించినట్లుగా.. ఒక వ్యక్తి రోడ్డు పక్కన నిలబడి తన మొబైల్ ఫోన్‌లో ఒక బటన్ నొక్కగానే, కొద్ది మీటర్ల దూరంలో వెళ్తున్న ఈ రిక్షా ఒక్కసారిగా ఆగిపోతుంది. ఎలాంటి వైర్లు, భౌతిక సంబంధం లేకుండా కేవలం BAT-BMS అనే ఒక యాప్ ద్వారా ఈ-రిక్షాలను రిమోట్‌గా ఆఫ్ చేస్తున్న ఈ వీడియోలు మిలియన్ల వ్యూస్ సాధించాయి. చాలా మంది ప్రాంక్ కోసమని రన్నింగ్‌లో ఉన్న రిక్షాలను ఆపేస్తుండటంతో డ్రైవర్లలో భయాందోళనలు మొదలయ్యాయి.
అయితే ఈ స్టోరీ కేవలం ఈ రిక్షాలకే పరిమితం కాలేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లోని ఒక వర్గం ఈ అంశాన్ని మరో వైపు తిప్పింది. ‘‘ఒక సాదాసీదా మొబైల్ యాప్ ద్వారా రోడ్డుపై వెళ్లే ఈ-రిక్షానే బ్లూటూత్ సహాయంతో హ్యాక్ చేసి ఆపేయగలిగినప్పుడు, దేశంలో వాడే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఎందుకు హ్యాక్ చేయలేరు?” అంటూ రాజకీయ విమర్శలు, పోస్టులు మొదలయ్యాయి. ట్విట్టర్‌లో కొందరు వ్యంగ్యంగా, మరికొందరు జర్నలిస్టుల ముసుగులో.. ‘‘ఈ రిక్షాలను హ్యాక్ చేయవచ్చు కానీ, ఈవీఎంలను మాత్రం హ్యాక్ చేయలేరట’’ అంటూ హిందీ, ఇంగ్లీష్‌లలో పోస్టులు పెడుతూ అనుమానాలు రేకెత్తించారు. నిజంగానే ఈ రిక్షాలాగా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనా? ఈ వాదనలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే, ముందుగా ఈ-రిక్షాల విషయంలో అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి.
ఇది నిజానికి ఒక సాఫ్ట్‌వేర్ హ్యాకింగ్ కాదు.. తయారీదారులు వదిలేసిన ఒక తాళం లేని తలుపు మాత్రమే. దీని వెనుక మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి..
BMS (బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్): ప్రస్తుత ఈ రిక్షాలలో పాత లీడ్ యాసిడ్ బ్యాటరీల స్థానంలో లిథియం – అయాన్ బ్యాటరీలను వాడుతున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ లోపల వోల్టేజ్, ఉష్ణోగ్రతలను పర్యవేక్షించే ఒక చిన్న చిప్ ఉంటుంది. దానినే BMS అంటారు. బ్యాటరీ ఎప్పుడైనా ఓవర్ హీట్ అయినా లేదా షార్ట్ సర్క్యూట్ అయినా ప్రమాదాలు జరగకుండా ఇది కేవలం మిల్లీ సెకన్లలో పవర్‌ను కట్ చేస్తుంది. ఇది బ్యాటరీ రక్షణ కోసం పెట్టిన ఒక సేఫ్టీ ఫీచర్.
బ్లూటూత్ కనెక్షన్ ఎందుకు?: చైనాకు చెందిన తక్కువ బడ్జెట్ బ్యాటరీ తయారీదారులు ఈ BMS చిప్‌లలో బ్లూటూత్ ఫీచర్‌ను ఇన్ బిల్ట్ చేస్తారు. దీనివల్ల మెకానిక్‌లు లేదా ఓనర్లు బ్యాటరీ బాక్స్‌ను విప్పకుండానే మొబైల్ యాప్ ద్వారా బ్యాటరీ హెల్త్, ఛార్జింగ్ లెవెల్స్ చూసుకోవచ్చు. ఇందుకోసం వాడే ఒక టూల్ పేరే ఈ BAT-BMS యాప్.
సెక్యూరిటీ లోపం: ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఖర్చు తగ్గించుకోవడానికి చైనా నుండి బల్క్‌గా కొనుగోలు చేసిన ఈ బ్యాటరీ యూనిట్లకు చాలా మంది స్థానిక తయారీదారులు, డీలర్లు ఎలాంటి పాస్‌వర్డ్ లేదా ఎన్‌క్రిప్షన్ సెట్ చేయకుండానే మార్కెట్లో అమ్మేశారు. ఫలితంగా ఈ బ్యాటరీలు 15 మీటర్ల పరిధిలో ఉన్న ఏ మొబైల్ బ్లూటూత్‌కైనా కనెక్ట్ అయ్యేలా ఓపెన్‌గా ఉండిపోయాయి.
వైరల్ వీడియోలలో చేస్తున్నది ఇదే. యాప్ ఓపెన్ చేయగానే పక్కనే ఉన్న అన్‌సెక్యూర్డ్ బ్యాటరీ కనెక్ట్ అయిపోతుంది. టెక్నీషియన్లు మెయింటెనెన్స్ కోసం వాడే షట్‌డౌన్ కమాండ్‌ను ప్రాంక్ చేసేవాళ్లు నొక్కుతున్నారు. దీనిని హ్యాకింగ్ అనడం కంటే.. తాళం లేని ఇంట్లోకి ఎవరైనా నడుచుకుంటూ వెళ్లడంతో సమానం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి యాప్స్ గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ల నుండి తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.
ఈ రిక్షా హ్యాక్ అవుతోంది కాబట్టి ఈవీఎం కూడా హ్యాక్ అవుతుందనే వాదన పూర్తిగా నిరర్థకమైనది. ఎందుకంటే ఈవీఎంల డిజైన్ ఫిలాసఫీ పూర్తిగా భిన్నమైనది. మన దేశంలో వాడే ఈవీఎంలు పూర్తిగా స్టాండ్ అలోన్ మిషన్లు. అంటే వీటికి ఎలాంటి బ్లూటూత్, వై-ఫై, ఇన్‌ఫ్రారెడ్, ఇంటర్నెట్ లేదా ఎలాంటి వైర్‌లెస్ రేడియో ఫ్రీక్వెన్సీ చిప్‌లు ఉండవు. ఈవీఎం హార్డ్‌వేర్‌లోనే ఆయా కమ్యూనికేషన్ పోర్ట్స్ లేనప్పుడు, రిమోట్‌గా మొబైల్ యాప్ ద్వారా దానికి కనెక్ట్ అవ్వడం అనేది ఇంపాజిబుల్.
భౌతిక భద్రత – కఠినమైన ప్రోటోకాల్స్: ఈవీఎంలో డేటాను మార్చాలన్నా లేదా టాంపర్ చేయాలన్నా మిషన్‌ను భౌతికంగా ఓపెన్ చేయాల్సిందే. కానీ భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అది సాధ్యం కాదు. ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి మిషన్లను సీల్ చేస్తారు. పోలింగ్ కేంద్రం నుండి కౌంటింగ్ సెంటర్ వరకు నిరంతరం భద్రతా బలగాలు, పార్టీ ఏజెంట్ల నిఘా ఉంటుంది. సీల్ కొద్దిగా దెబ్బతిన్నా ఆ మిషన్ ఫలితాలను రద్దు చేస్తారు. ఈ వ్యవస్థను సుప్రీంకోర్టు సైతం పలుమార్లు సమర్థించింది.
కాగా ఒక సాధారణ సైకిల్ తాళాన్ని స్క్రూడ్రైవర్‌తో విరగ్గొట్టవచ్చు కాబట్టి అదే స్క్రూడ్రైవర్‌తో బ్యాంకు లాకర్‌ను కూడా ఓపెన్ చేయవచ్చని వాదించడం ఎంత హాస్యాస్పదమో.. ఈ రిక్షా బ్లూటూత్ లోపాన్ని చూపిస్తూ ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనడం కూడా అంతే అశాస్త్రీయం అని నిపుణులు అంటున్నారు.