
ప్రపంచ రాజకీయ యవనికపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్ ద్వారా సుదీర్ఘంగా చర్చించారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన, ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి భద్రతపై ఈ ఇద్దరు అగ్రనేతలు లోతుగా చర్చించినట్లు భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ అధికారికంగా వెల్లడించారు.
ఈ సంభాషణలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం హోర్ముజ్ జలసంధి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్‌లో దాదాపు 30 శాతం ఈ సన్నని సముద్ర మార్గం గుండానే వెళ్తుంది. ఒకవేళ ఇరాన్ ఈ జలసంధిని పూర్తిగా మూసివేస్తే, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది భారత్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఈ మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరిచి ఉంచాలని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.
బ్రిటిష్ దినపత్రిక ది ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. అయితే ఆ వార్తలు వచ్చిన కొద్ది గంటల్లోనే ట్రంప్ నేరుగా మోదీకి ఫోన్ చేయడం గమనార్హం. పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారంలో భారత్ పాత్రే అత్యంత విశ్వసనీయమైనదని అమెరికా భావిస్తున్నట్లు రాయబారి సెర్గియో గోర్ X పోస్ట్ ద్వారా పరోక్షంగా స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో శత్రుత్వాలను శాశ్వతంగా అంతం చేసే దిశగా చాలా మంచి, ఫలవంతమైన సంభాషణలు జరిగాయి అని ట్రంప్ ఒక రోజు ముందే ప్రకటించడం ఈ ఫోన్ కాల్ ప్రాధాన్యతను పెంచుతోంది.
యుద్ధానికి కొన్ని రోజులు విరామం ఇచ్చిన తరుణంలో ట్రంప్ నేరుగా మోదీని సంప్రదించడం ద్వారా అంతర్జాతీయ వివాదాల్లో భారత్ ఒక శక్తివంతమైన శాంతి దూతగా ఎదిగిందని స్పష్టమవుతోంది. కేవలం చమురు మాత్రమే కాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, రక్షణ సహకారంపై కూడా ప్రాథమికంగా చర్చలు జరిగినట్లు సమాచారం.
President Donald Trump just spoke with Prime Minister Modi. They discussed the ongoing situation in the Middle East, including the importance of keeping the Strait of Hormuz open.
— Ambassador Sergio Gor (@USAmbIndia) March 24, 2026