
జనాలకు మెరుగైన సేవలందిస్తున్న మెట్రో రైళ్లు మరిన్ని వసతులను కల్పించేందుకు రెడీ అవుతున్నాయి. దేశంలోని పలు మెట్రో స్టేష్లను ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కొత్త రకం థీమ్స్ ను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ సిటీలు ఆకర్షణీయమైన వసతులను కల్పిస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ 137 స్టేషన్లలో మెట్రో రైలు రెస్టారెంట్ సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. అంటే మెట్రో కోచ్ లోనే హాయిగా తింటూ ప్రయాణించవచ్చు. మెట్రో రైలు వాతావరణంలో ప్రయాణీకులు భోజనాన్ని ఆస్వాదించడానికి వీలు కల్పించే ప్రత్యేకమైన డైనింగ్ కాన్సెప్ట్ ను కార్పొరేషన్ అభివృద్ధి చేసింది.
స్టేషనరీ కోచ్ లోపల ఉన్న ఈ రెస్టారెంట్ సుమారు 100 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు చేస్తుంది. ఫ్యామిలీలు, స్నేహితులు పార్టీలతో పాటు సమావేశాలను నిర్వహించడానికి అనుమతిస్తుంది. ప్రయాణికులు కోచ్ వెలుపల మెనూ నుండి ఆహారం, డ్రింక్స్ ఆర్డర్ చేసుకొని కోచ్ లో వివిధ రకాల వంటకాలు ఆస్వాదించవచ్చు.
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నడుస్తున్న ఈ రెస్టారెంట్ ను ఏప్రిల్ 20న ప్రారంభిస్తామని, ఉదయం 11:30 గంటల నుంచి 12 గంటల వరకు ప్రజలు ఈ రెస్టారెంట్ ను సందర్శించవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ఏదేమైనా ఈరకమైన రైళు రెస్టారెంట్ అందుబాటులోకి వస్తుండటంతో జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సిబ్బందికి ట్రైనింగ్ తర్వాత ఏప్రిల్ 20 నుంచి రెస్టారెంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. మెట్రో నెట్వర్క్ పరిధిలో రెస్టారెంట్ నిర్వహణకు బాధ్యత వహించే ఏజెన్సీకి ఎన్ఎంఆర్సీ తొమ్మిదేళ్ల కాంట్రాక్టు ఇచ్చింది. ఒకవేళ ఈ రకమైన కొత్త పద్దతి సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి రైలు రెస్టారెంట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి న్యూ థీమ్స్ ప్రవేశపెట్టడంతో మెట్రో ఆదాయం పెరగడంతో సేవలను విస్తరించేందుకు దోహదపడుతుందని మెట్రో అధికారులు చెబుతున్నారు.