
తమిళనాట మరో సినీ హీరో రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమవుతుందా? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ప్రముఖ నటుడు ధనుష్ రాజకీయ అడుగులు శరవేగంగా పడుతుండటంతో కోలీవుడ్ సహా తమిళ రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. వారం రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో పలువురు కీలక వ్యక్తులతో మంతనాలు జరిపిన ధనుష్, తాజాగా చెన్నై వేదికగా చేపట్టిన కార్యక్రమం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. చెన్నై ఓఎంఆర్ రోడ్డు, చోళింగనల్లూరులోని జెప్పియార్ ఇంజినీరింగ్ కాలేజీలో ధనుష్ మహిళా అభిమాన సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ధనుష్ అభిమాన సంఘానికి సంబంధించి తమిళనాడులోని 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ భేటీకి తరలివచ్చారు.
సుమారు 2,500 మందికి పైగా ప్రతినిధులతో పాటు, మొత్తం 3,000 మందికి పైగా మహిళా అభిమానులతో ధనుష్ ముఖాముఖి భేటీ అయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అభిమానులతో ఫొటోలు, నేరుగా వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళా ఓటు బ్యాంకుతోనే ఏ రాజకీయ ప్రయాణమైనా బలపడుతుందనే ఉద్దేశంతోనే ధనుష్ తొలి ప్రాధాన్యతగా ఈ భేటీని ఏర్పాటు చేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ధనుష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని, 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. ప్రస్తుత సమావేశంలోనూ అభిమానులు ఇదే నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఢిల్లీ పరిణామాల వెంటనే ఈ స్థాయిలో రాష్ట్రవ్యాప్త మహిళా అభిమానులతో సమావేశం కావడం ధనుష్ రాజకీయ ప్రవేశానికి స్పష్టమైన పునాదిగా కనిపిస్తోంది.
మరోవైపు ధనుష్ రాజకీయ కదలికలు ఇతర పక్షాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం నేత ఆదవ్ అర్జున ధనుష్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ‘‘డీఎంకే అనే సైతాన్ పోయింది.. ఇప్పుడు పిల్ల సైతాన్లు తమిళనాడులోకి రాబోతున్నాయి. ఢిల్లీలో కూర్చొని ఏ నటుడు డ్రామాలాడుతున్నాడో మాకు తెలియదా?’’ అంటూ ఆయన చేసిన విమర్శలు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ధనుష్ అడుగులు ఎటువైపు..? టీవీకేకు ఎటువంటి కౌంటర్ ఇస్తారన్ని ఆసక్తిగా మారింది.