Smart Highway: దేశంలోనే తొలి డిజిటల్ హైవే – నిబంధనలు ఉల్లంఘిస్తే క్షణాల్లో చలాన్‌

దేశంలోనే తొలి డిజిటల్ హైవే అందుబాటులోకి వచ్చింది. ఇది స్మార్ట్‌ హైవే. ఈ హైవే మీద మైవే అంటూ స్పీడుగా దూసుకుపోవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ హైవేపై ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనకు ఎట్టి పరిస్థితుల్లోనే నో వే! రూల్స్ అతిక్రమిస్తే క్షణాల్లో చలాన్‌ వచ్చేస్తుంది.

Smart Highway: దేశంలోనే తొలి డిజిటల్ హైవే -  నిబంధనలు ఉల్లంఘిస్తే క్షణాల్లో చలాన్‌
Dwarka Expressway ( File Photo)

Updated on: Jun 29, 2025 | 7:15 PM

జాతీయ రహదారుల రూపురేఖలు మారుతున్నాయి. వాహనదారులు రయ్‌రయ్‌మని దూసుకెళ్లేలా సువిశాలమైన రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తులో ఇవి స్మార్ట్‌ హైవేలుగా సరికొత్త రూపం సంతరించుకోబోతున్నాయి. ఢిల్లీ-గురుగ్రామ్‌ను కలిపే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై AI సాయంతో పనిచేసే అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.

నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ATMS రూపుదిద్దుకుంది. ఇండియన్‌ హైవేస్‌ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌ దీన్ని అభివృద్ధి చేసింది. దీన్ని అమలు చేసే బాధ్యత NHAI చూస్తుంది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ హైవేతో పాటు NH-48పై 28 కిలోమీటర్ల మేర అత్యాధునిక నిఘా వ్యవస్థను జోడించారు. మొత్తంగా 56.46 కిలోమీటర్ల మేర రహదారిపై ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా దేశంలోనే తొలిసారిగా AI ఆధారిత స్మార్ట్‌ ట్రాఫిక్‌ సిస్టమ్‌ కలిగిన డిజిటల్‌ హైవేగా ఈ రహదారి గుర్తింపు పొందింది. ట్రాఫిక్‌ మానిటరింగ్‌, ప్రమాదాల గుర్తింపు ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. ఈ AI ఆధారిత స్మార్ట్‌ ట్రాఫిక్‌ సిస్టమ్‌తో పనిచేసే డిజిటల్‌ హైవే..ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

సీట్‌ బెల్ట్ పెట్టుకోకపోతే కెమెరా కళ్లు పసిగడతాయి. ట్రిపుల్ రైడింగ్‌, పరిమితికి మించిన వేగం లాంటి.. 14 రకాల ట్రాఫిక్‌ ఉల్లంఘనలు పసిగట్టే ATMS ఈ వ్యవస్థకు NIC ఈ-చలాన్‌ పోర్టల్‌తో అనుసంధానం చేశారు. ఉల్లంఘన జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం వెళ్తుంది. -హైవేపై కిలోమీటర్‌కి 1చొప్పున 110 హై రిజల్యూషన్‌ PTZ కెమెరాల ఏర్పాటు చేశారు. స్మార్ట్‌ హైవేపై 24/7 నిఘా నేత్రం ఉంటుంది. ATMSలో 5 రకాల వ్యవస్థలు ఉంటాయి. ట్రాఫిక్‌ మానిటరింగ్‌, ప్రమాదాల వీడియోల చిత్రీకరణ.. వాహన వేగం, సైన్‌బోర్డులు, సెంట్రల్‌ కంట్రోల్ రూమ్‌ ఉంటాయి

ఇందులోని కమాండ్‌ సెంటర్‌ అనేది డిజిటల్‌ బ్రెయిన్‌గా వ్యవహరిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్థానిక, జాతీయ రహదారి సిబ్బందికి సమాచారం అందిస్తుంది. దట్టమైన పొగమంచు ఏర్పడడం, రహదారిపై అడ్డంకులు ఏర్పడినప్పుడు, రహదారులపైకి జంతువులు ప్రవేశించినప్పుడు సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై అమలు చేసిన ఈ ఆటోమేటెడ్‌ వ్యవస్థను దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. అదే జరిగితే మన జాతీయ రహదారులు మరింత ఆధునికతను సంతరించుకోనున్నాయి.